చెరువు నీటిపై డిష్యుం డిష్యుం : ఎంపీ v/s మాజీ మంత్రి

చెరువు నీటిపై డిష్యుం డిష్యుం : ఎంపీ v/s మాజీ మంత్రి

హోసూరు : ఇక్కడి రామనాయకుని చెరువును దక్షిణ పెన్నా నీటితో నింపామనే సాకుతో హోసూరు కార్పొరేషన్ అధికారులు రూ.కోటి స్వాహా చేశారని కృష్ణగిరి ఎంపీ సెల్లకుమార్ ఆరోపించారు. హోసూరు బాగలూరు రోడ్డులో గల కార్పొరేషన్ కార్యాలయం ముందు గురువారం ఆయన నిరాహారదీక్ష చేపట్టడానికి ప్రయత్నించారు. నిరాహార దీక్షకు పోలీసుల అనుమతి లేకపోవడంతో ఎంపీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సెల్లకుమార్ మాట్లాడుతూ కెలవరపల్లి డ్యాం నుంచి పైపుల ద్వారా రామనాయకుని చెరువును నింపామని చెప్పి రూ.కోటికి పైగా నిధులు స్వాహా చేశారని ధ్వజమెత్తారు. ఏడాదికి పైగా చెరువుకు నీరు నింపినట్టు బిల్లులు వేసి నిధులు స్వాహా చేశారని, చెరువులో నీరు మాత్రం కనిపించలేదని ఎద్దేవాచేశారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన కమిషనర్‌ను సెల్లకుమార్ నిలదీశారు. చెరువును నింపామంటూ స్వాహా చేసిన నిధుల లెక్కలు తేల్చాలని ఎంపీ, హోసూరు కార్పొరేషన్ కమిషనర్‌ను నిలదీశారు. వారం రోజుల్లో అణా పైసలతో లెక్కలు చెబుతామని కమిషనర్ తెలిపారు. ఎంపీ సెల్లకుమార్‌ వెంట హోసూరు మాజీ ఎమ్మెల్యే మనోహరన్, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.

బాలకృష్ణారెడ్డి ఎదురు దాడి

కృష్ణగిరి ఎంపీ  సెల్లకుమార్ ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో దృష్టి పెట్టకుండా ఇతరులు చేసిన పనులలో తప్పులు వెదుకుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మాజీమంత్రి బాలకృష్ణారెడ్డి ఎదురు దాడికి దిగారు. హోసూరు రామనాయకుని చెరువును నింపామని చెప్పి నిధులు స్వాహా చేశారని సెల్లకుమార్ చేసిన ఆరోపణపై బాలకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాను మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు కేవలం రూ.24 లక్షల నిధులతో పైపు లైన్ వేసి కెలవరపల్లి డ్యాం నీటితో రామనాయకుని చెరువును నింపే విధంగా చర్యలు చేపట్టామని బాలకృష్ణారెడ్డి తెలిపారు. 2018 ఫిబ్రవరి నుంచి  2019 అక్టోబర్ వరకు చెరువును నింపామని, తరువాత రూ.24 కోట్లతో కర్నూరు, అందివాడి, రామనాయకుని చెరువు, కల్కెరీ చెరువులను సుందరంగా తీర్చిదిద్దే పనులు ప్రారంభించామని గుర్తు చేశారు. హోసూరు తళి రోడ్డు, టివిఎస్ నగర్,  రైల్వే క్రాసింగ్ వద్ద ఫ్లైవోవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే, ఆ పనులు కూడా తనవల్లే వచ్చాయని సెల్లకుమార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. కృష్ణగిరి మెడికల్ కాలేజి కూడా తన వల్లే జిల్లాకు దక్కిందని ప్రజలకు బూటకం మాటలు చెబుతూ ఎన్నికల వాగ్ధానాలు మరచిపోయారని ఎద్దేవా చేశారు. జిల్లాలో చక్కబెట్టాల్సిన పనులు చాలా వున్నా, చెరువు నీటి విషయమై రాజకీయం చేయడం ఎంపీకి తగదని బాలకృష్ణారెడ్డి హితవు పలికారు. ఎంపీ మంచి పనులు చేస్తే ఆహ్వానిస్తామని సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించకుండా ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడానికి కృషి చేస్తే మంచిదని బాలకృష్ణారెడ్డి హితవు పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos