మోహన్ బాబుకు సుప్రీంకోర్టు షాక్

మోహన్ బాబుకు సుప్రీంకోర్టు షాక్

న్యూఢిల్లీ :  నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2019 నాటి ఎన్నికల సమయంలో ఎలెక్షన్ కోడ్ ఉల్లంఘన కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ను నిన్న సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ, స్టే ఇవ్వాలని మోహన్‌బాబు చేసిన అభ్యర్థనను జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. 2019 ఎన్నికల సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ మోహన్‌బాబు విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన ధర్నా కార్యక్రమం అప్పట్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్న ఆరోపణలతో కేసు నమోదైన సంగతి తెలిసిందే. రేపు సంబంధిత విచారణ అధికారి ఎదుట మోహన్‌బాబు కచ్చితంగా హాజరు కావాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ధర్నా జరిగిన సమయంలో మోహన్‌బాబు వ్యక్తిగతంగా అక్కడ ఉన్నారా? అని ధర్మాసనం ఆయన తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.మోహన్‌బాబు తరపున వాదనలు వినిపించిన న్యాయవాది, ఆయన 75 ఏళ్ల వయసున్న వారని, విద్యాసంస్థను నడుపుతున్నారని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తించదని వాదించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం తమ సంస్థ ఆధ్వర్యంలో చేసిన నిరసన కార్యక్రమం నిబంధనల ఉల్లంఘన పరిధిలోకి రాదని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఛార్జిషీట్‌లో తమపై కోడ్ ఉల్లంఘన అభియోగాలు మోపారని కోర్టు దృష్టికి తెచ్చారు.ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ, విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos