ఇలపై స్వర్గం మాసినగుడి..

ఇలపై స్వర్గం మాసినగుడి..

చారిత్రాత్మకంగా,పర్యాటకంగా మైసూరు జిల్లాకు ఎప్పటికీ ప్రత్యేకస్థానం ఉంటుంది.లెక్కలేనన్ని ఆధ్యాత్మిక,చారిత్రాత్మక ప్రాంతాలతో పాటు కళ్లు తిప్పుకోలేని ప్రకృతి అందంతో అలరారే పర్యాటక ప్రాంతాలతో మైసూరు పర్యాటక కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది.మైసూరు పర్యాటక సిగలో మరో కీలక ప్రదేశం మాసినగుడి.మైసూరు-తమిళనాడు సరిహద్దుల్లో నీలగిరి తోటలతో,దట్టమైన అడవులతో,వన్యప్రాణాలు,పక్షులతో అలరారుతున్న మాసినగుడి ప్రకృతి ప్రేమికులకు ఎప్పటికీ స్వర్గధామమే.కొన్నిసార్లు పక్షుల కిలకిలలు,వన్యప్రాణుల ఘీంకారాలు,గర్జనలతో ఆసక్తిగొలిపుతూ మరికొన్ని సార్లు నిశ్శబ్దమైన గాలులతో భీతిగొలిపే మాసినగుడి పర్యటన భిన్నమైన మధురజ్ఞాపంగా మిగిలిపోతుంది.

మాసినగుడి అందాలు..

మాసినగుడి అందాలు..

మాసినగుడి అందాలు..

వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న మాసినగుడి అటవీప్రాంతం ఎన్నో అరుదైన వృక్షాలకు నిలయంగా ఉంది.వీటితో పాటు పెద్దపులులు,అడవి ఏనుగులు,బూడిద రంగు లంగూర్‌,ఎగిరే బల్లులు,సాంబార్‌ జింకలు,అడవిపందులు,జెయింట్‌ ఫ్లయింగ్‌ ఉడుతలు,చిరుతలు,అడవిదున్నలు తదితర ఎన్నో వన్యప్రాణులు,క్రూరమృగాలకు శాశ్వత ఆవాసంగా ఉంటోంది.వీటితో పాటు ఎన్నడూ చూడని మలబార్‌ హార్న్‌బిల్స్‌,వైట్‌బెల్లీడ్‌ వడ్‌పెక్కర్‌,ఏషియన్‌ ఫెయిరీ బ్లూబర్డ్స్‌,ఆకుపచ్చ పావురాలు,నల్ల గద్దలు,జంగిల్‌ బుష్‌ క్వాయిల్‌,గ్రే హెడ్‌ బుల్‌బుల్‌,గ్రీన్‌ బీ-ఈటర్స్‌ తదితర ఎన్నో అరుదైన పక్షులు,కొండచిలువలు,నల్లత్రాచు(కింగ్‌కోబ్రా)లు కూడా దర్శనమిస్తాయి..

శిఖరం అంచున రెసార్ట్‌..

మాసినగుడి పర్యటనలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల గురించి పరిశీలిస్తే..
తెప్పకాడు ఏనుగు శిబిరం..
అటవీశాఖ నిర్వహణ నేతృత్వంలోని ఏనుగుల శిబిరం తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.పదుల సంఖ్యలో ఏనుగులకు ఈ శిబిరంలో శిక్షణ ఇస్తుంటారు.గ్రామాల్లో చొరబడే పులులు,చిరుతలను బంధించడానికి,అడవులను,పంట పొలాలలను ధ్వంసం చేసే దారితప్పిన గజరాజులను దారిలోకి తేవడానికి అనువైన శిక్షణ ఇస్తుంటారు.దీంతోపాటు ఏనుగుల జలకాలాటలు,విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయి.

గజరాజుల గాంభీర్యం..

గజరాజుల గాంభీర్యం..


నీలగిరి తేయాకు తోటలు..
మాసినగుడికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రదేశాల్లో తేయాకు తోటలు పాత్ర చాలా కీలకం.ఎత్తైన కొండలు,లోయలల్లో ఎటు చూసినా పచ్చటి దుప్పటిలా పరుచుకొని ఉండే తేయాకు తోటలు కనువిందు చేస్తూ కళ్లకు,మనసుకు ఆహ్లాదం పంచుతాయి.గుబురుగా కనిపించే తేయాకు తోటలు చూస్తూ వాటి నుంచి వచ్చే పరిమళాలు ఆస్వాదిస్తూ తోటల మధ్యలో నడక సాగిస్తుంటే ఆ అనుభవం చెప్పడం సాధ్యం కాదు.అంతేకాదు తేయాకు నుంచి టీ పొడి ఎలా తయారు చేస్తారో కూడా ఇక్కడ ఉన్న కొన్ని కుటీర పరిశ్రమల ద్వారా తెలుసుకోవచ్చు..

తేయాకు తోటలు..

తేయాకు తోటలు..

తేయాకు తోటలు..

ముదుమలై నేషనల్‌ పార్క్‌..
మాసినగుడి పర్యటనలో మరో కీలకప్రదేశం ముదుమలై నేషనల్‌ పార్క్‌.మాసినగుడి నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముదుమలై జంతు,ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా పిలుచుకుంటారు.పెద్దపులుల సంతానోత్పత్తికి,సంరక్షణకు నేషనల్‌ పార్క్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ముదుమలైలో పులి గాంభీర్యం..

ముదుమలైకి వెళితే గంభీరంగా నడుస్తూ పొగరుగా చూస్తూ గాండ్రించే పెద్దపులులను కంచె వెలుపల నుంచి చూడవచ్చు.అక్కడినుంచి అడవిలోకి ప్రవేశిస్తే ఏనుగులు,చిరుతలు,బద్దకపు ఎలుగుబంట్లు,నల్ల ప్లైకాచర్‌,వడ్రంగిపిట్టలు,కలప గుడ్లబగూబలు తదతర పక్షులను తిలకించవచ్చు.ముదుమలైకి సమీపంలోని కళ్లహట్టి జలపాతం కట్టిపడేస్తుంది.జాతీయ ఉద్యానవనంలో మరింతగా పర్యటించి అడవి అందాలు చూడాలనుకుంటే అటవీశాఖ ప్రత్యేకంగా జీప్‌ సఫారి కూడా అందుబాటులో ఉంచింది..

కళ్లహట్టి జలపాతం..

బండీపుర జాతీయ ఉద్యానవనం..
మాసినగుడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనున్న బండీపుర జాతీయ ఉద్యానవనం అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు కలిగి ఉంది.దేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాల్లో బండీపుర జాతీయ ఉద్యానవనం అతిముఖ్యమైనది.సుమారు నాలుగు వందల వరకు పెద్దపులులు బండీపుర జాతీయ ఉద్యానవనంలో ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.సఫారీలో ప్రయాణించే సమయంలో అక్కడక్కడా పెద్దపులులను గమనించవచ్చు.వీటితోపాటు ఏనుగులు,మచ్చలజింకలు,గౌర్స్ జింకలు,కొండ చిలువలు,నక్కలు,పీఫౌల్‌,ఇండియన్‌ రోలర్స్‌,గద్దలు,కింగ్‌ఫిషర్‌ తదతర పక్షులు,వన్యప్రాణులు అడవిలో విరివిగా దర్శనమిస్తాయి..

బండీపుర జాతీయ ఉద్యానవనంలో పులి రాజసం..

మోయార్‌ నది..
ప్రశాంతంగా,గంభీరంగా దర్శనమిచ్చే యోయార్‌ నది కూడా మాసినగుడి పర్యటనలో కీలకమే.మాసినగుడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోయార్‌ నది పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉండడంతో ట్రెక్కింగ్‌ చేసే సమయంలో సమూహంగా వచ్చిన పర్యాటకులు,ఒంటరి పర్యాటకులు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి మోయార్‌ నది అనువైన ప్రదేశం.రోజువారీ ఒత్తిళ్ల నుంచి కాసేపు ఉపశమనం పొందాలంటే మోయార్‌ నది చక్కటి ప్రదేశం,చుట్టూ ఎత్తైన పచ్చటి కొండలు,చల్లటి గాలులు మధ్య చల్లటి నదీ ప్రవాహంలో చేపల తుళ్లింతలతో మనసు తేలికపడి తెలియని ఉల్లాసం,ఆహ్లాదం,పునరుత్తేజం కలిగిస్తుంది..

మోయార్‌ నది..

ఇలా చేరుకోవాలి..
రోడ్డు మార్గం లేదా రైలు మార్గం ద్వారా మైసూరుకు చేరుకొని అక్కడి నుంచి 97 కిలోమీటర్ల దూరంలోనున్న మాసినగుడికి ప్రభుత్వ లేదా ప్రైవేటు వాహనాల్లో మధుమలైకి చేరుకోవాలి.అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో 17 కిలోమీటర్లు ప్రయాణిస్తే మాసినగుడికి చేరుకోవచ్చు.విమానమార్గం ద్వారా చేరుకోవాలంటే నేరుగా తమిళనాడులోని కోయంబత్తూర్‌ చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో మాసిగనగుడికి నేరుగా చేరుకోవచ్చు.సొంత వాహనాల్లో వెళితే ఆయా రైల్వేస్టేషన్లు,విమానాశ్రయం నుంచి మాసినగుడి రోడ్డు ప్రయాణం సైతం అదనపు ఆహ్లాదంగా నిలుస్తుంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos