అందమైన మండలపట్టీ..

  • In Tourism
  • February 12, 2020
  • 296 Views
అందమైన మండలపట్టీ..

పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే మడికేరిలో్ మరో మనోహరమైన పర్యాటక ప్రదేశం మండలపట్టి హిల్‌స్టేషన్‌.కూర్గ్‌ జిల్లా మొత్తం వ్యాపించిన ఉన్న దట్టమైన పశ్చిమ కనుమల్లోని పుష్పగిరి అడవుల్లో ఆకాశాన్ని తాకుతూ 1800 మీటర్ల ఎత్తు కలిగిఉన్న మండలపట్టి పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే సంజీవినిగా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ లభించే ప్రశాంతత,సుగంధ ద్రవ్యాల పరిమళాలు వెదజల్లుతూ చల్లగా వీచే పవనాలు మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చేలా ప్రేరేపిస్తాయి.ఇక శిఖరం అంచునుంచి సూర్యోదయం,సూర్యస్తమయం చూడకుంటే మీకంటే దురదృష్టవంతులు ప్రపంచంలో ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

అందమైన మండలపట్టీ..

కూర్గ్‌ జిల్లాలో జనారణ్యానికి సుదూరంగా ప్రశాంత వాతావరణంలో ఉన్న మండలపట్టిలో ప్రాచీన నాగరికత ఆనవాళ్లు కూడా లభించాయని స్థానిక చరిత్ర.కొద్ది కాలం క్రితమే మండలపట్టి పర్యాటకంగా ప్రసిద్ధి చెందడంతో దేశం నలుమూలల నుంచి ప్రకృతి ప్రేమికులు,ట్రెక్కింగ్‌ సాహసీకులు మండలపట్టీ విహారానికి ఆసక్తి కనబరుస్తున్నారు.స్థానిక వాతావరణ,భౌగోళిక పరిస్థితుల కారణంగా ఈ మండలపట్టీని ముగిలు-పీట్‌ లేదా ముగిలు-పెత్‌ అని కూడా పిలుస్తారు.ఈ పేర్ల అర్థం మార్కెట్‌ ఆఫ్‌ క్లౌడ్స్‌ అంటే తెలుగులో పొగమంచు,మేఘాల సంత అని అర్థం.దట్టమైన అటవీప్రాంతం కావడంతో మండలపట్టీ శిఖారానికి చేరుకోవడానికి ట్రెక్కింగ్‌ చేసే క్రమంలో అందమైన ప్రకృతి దృశ్యాలు మాత్రమే కాదు క్రూరమృగాలు,వన్యప్రాణులు,అందమైన జలపాతాలు,సెలయేళ్ల ప్రవాహాల తారసపడతాయి.

కోటె అబ్బె జలపాతం..

ట్రెక్కింగ్‌ సమయంలో కలిగే అలసటను ఈ రమణీయ దృశ్యాలన్నీ మటుమాయం చేస్తాయి.కాఫీ,తేయాకుతో పాటు యాలకులు తదితర సుగంధ ద్రవ్యాల తోటలు సైతం సాగు చేయడంతో ట్రెక్కింగ్‌ ఆసాంతం సుగంధ పరిమళాలు మనసుకు ఆహ్లాదం పంచుతుంటాయి.వర్షాకాలంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జులై నుంచి నవంబర్‌ వరకు మండలపట్టీలో ట్రెక్కింగ్‌ కొంచెం సాహసంతో కూడుకొని ఉంటుంది.మిగిలిన అన్ని కాలాల్లో వాతావరణ చల్లగా,పొడిగా ఉండడంతో ట్రెక్కింగ్‌ చాలా అందంగా ఉంటుంది.ఏడాది పొడవునా 20 నుంచి 25 డిగ్రీల ఉష్టోగ్రతలు మాత్రమే నమోదు కావడం మండలపట్టీ ప్రత్యేకత.మండలపట్టీ ట్రెక్కింగ్‌ అబ్బె జలపాతం జంక్షన్‌ మార్గం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.లేదా మక్కందూరు మార్గం మీదుగా వాహనాల్లో మండలపట్టి శిఖరం చెంతకు చేరుకొని అక్కడినుంచి ట్రెక్కింగ్‌ మొదలుపెట్టవచ్చు.

మండల్‌పట్టీ శిఖరం..

మండలపట్టిలో జీప్‌ రైడింగ్‌ మరో ప్రత్యేకత.అడవిమధ్యలో జీపులో ప్రయాణిస్తూ పుష్పగిరి అడవీ అందాలు తిలకించడం వర్ణించలేని అనుభవం.మండల్‌పట్టీ శిఖరం అంచుకు చేరుకున్న అనంతరం అటవీశాఖ నిర్మించిన కావలికోట మీదుగా శిఖరం చుట్టూ ఉన్న దట్టమైన పశ్చిమ కనుమల అందాలు అడవిమధ్యలో అక్కడక్కడా కనిపించే గిరిజన గ్రామాలు ఇంతకు మించిన స్వర్గం లేదేమో అనే భావన కలిగిస్తాయి.అన్నిటికంటే కావలికోట పైనుంచి సూర్యోదయం,సూర్యస్తమయం చూపుతిప్పుకోలేనంత  రమ్యంగా ఉంటాయి..

సూర్యోదయం..

సూర్యస్తమయం..

ట్రెక్కింగ్‌లో ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
హానికరమైన సౌరకిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి చర్మ సంబంధిత లేపనాలు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.నీలలోహిత కిరణాల నుంచి రక్షణ కళ్లకు రక్షణ కల్పించే సన్‌గ్లాసెస్‌,టోపీ,నీళ్లబాటిళ్లు ముఖ్యంగా క్లోజ్డ్‌ టక్డ్‌ బూట్లు ధరించాలి..

అడవి మధ్యలో జీపు ప్రయాణం..

ఎలా చేరుకోవాలి..
బెంగళూరు నుంచి ప్రభుత్వ లేదా ప్రైవేటు వాహనాల్లో నేరుగా మడికేరి పట్టణం చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలపట్టీ చేరుకోవాలి.అక్కడి నుంచి నడకద్వారా మండలపట్టీ శిఖరంపైకి ట్రెక్కింగ్‌ చేయవచ్చు.లేదంటూ అటవీశాఖ ఏర్పాటు చేసిన వాహనాల్లో సైతం అటవీమార్గం మధ్యలో శిఖరం పైకి చేరుకోవచ్చు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos