కారులో వ్యక్తి సజీవ దహనం

హొసూరు : ఇక్కడికి సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. హొసూరు-రాయకోట రోడ్డులోని సానమావు అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన సంభవించింది. రాయకోట వైపు వెళుతున్న కారు అదుపు తప్పి లారీని ఢీకొంది. కారు లారీ కింద చిక్కుకుని అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించడంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి బయటపడలేక సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదాన్ని చూసిన

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించి మంటలను అదుపు చేశారు. తమ కళ్ల ముందే కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనం కావడాన్ని చూసి స్థానికులు నిశ్చేష్టులయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి శవాన్ని స్వాధీనపరచుకుని హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు నంబరు ఆధారంగా మృతుని వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

తాజా సమాచారం