అమ్మ లాంటి కావ్యం

అమ్మ లాంటి కావ్యం

ఏ కవైనా,రచయితైనా తన జీవితం చవిచూసి న అనుభవాల నుంచో, అనుభూతుల నుంచో ఏదో ఒక విషయం తీసుకుని, దానికి తమవైన తాత్విక చింతనలు, కల్పనలు జోడించి సాహిత్యంగా ప్రపంచానికి అందిస్తారు. అనుభవం నుంచి పలువరించినపుడు పురుడుపోసుకున్న కవిత్వానికి, ఊహాత్మకంగా చెప్పిన సాహిత్యానికి ఆర్ద్రతలో, అభివ్యక్తిలో తేడా ఉం టుంది. ఆనాడు దళిత వేదనలో మగ్గి ప్రసవించబడిన గబ్బిలం కావ్యమైనా, తాడిత పీడిత కన్నీటి చారికలు అనుభవించి శిగమెత్తిన మహా ప్రస్థానం గీతాలైనా గుండె లోతుల్లోని తడిని అద్దుకుని పుట్టినవే. అలాంటి హృదయ వేదన, సంవేదన నుంచి పుట్టిన కవిత్వం యువ కవి కుం చె లక్ష్మీనారాయణ కలం నుంచి అక్షరీకరించబడిన భావోద్వేగమైన కావ్యం అమ్మ పేరే నా కవిత్వం. గతం తాలూ కు స్మృతిని, వర్తమాన భవిష్యత్ కాలాల్లో తల్లీ కొడుకుల అనుబంధాలకు, విలువలకు ప్రతిరూపంగా నిలిచి అనురాగాన్ని, సందేశాన్ని మోసుకొచ్చిన కావ్యం అమ్మ పేరే నా కవిత్వం. ఈ కవితా సంపుటి అణువణువునా అనుభూతి నిండిన నాస్టాల్జియా, అర్ద్రత నిండిన కవిత్వం ఉన్న ది. ఈ సంపుటిని పాఠకుడు తల్లీ కొడుకుల కథగా, కావ్యం గా అనుభూతి చెందుతాడు.

వస్తువు శిల్పంతో సంబంధం లేకుండా, ప్రతి మనసును ఆర్ద్రతతో నింపేది ఏదైనా వుంది అంటే, ఆ వస్తువుకు రూపం అమ్మ. మరి వస్తువు, శిల్పం రెండూ అమ్మే అయితే.. పాఠకుడికి ఆ కవిత్వం అమ్మ పాడిన జోలపాటే.చందమామ రావే జాబిల్లి రావే.. అని ఎన్ని సార్లు కవితల్లో చూసినా, ప్రతీసారీ ఓ కొత్త అనుభూతి మనసును పసి తనపు అమ్మ ఒడిలోకి తీసుకెళ్లుతుంది. అలాంటిది దాదాపుగా ఒక కవితా సంపుటి మొత్తం అమ్మే వస్తువుగా సాగితే అది పాఠకుడిని తిరిగి తన మాతృమూర్తి పొత్తిళ్ళలో తాను ఉమ్మ నీటిలో ఉన్నప్పు డు,అమ్మ చెప్పిన కథల దగ్గరి నుంచి,చేయి పట్టుకుని నడిపిన బాల్యాన్నీ, గోరు ముద్దలను, లాలి పాటలను హృదయాంతరాలలో పలికిస్తుంది. అలాంటి కావ్యానికి చిరునామా అమ్మ పేరే నా కవిత్వం.

ముఖ్యంగా పల్లెటూరిలో పెరిగిన బాల్యానికి ప్రతీకగా కవితా వాస్తుశిల్పం సాగింది. పచ్చని పంట పొలా ల నడుమ పెరిగిన వారు, ఈ కవిత్వాన్ని చదువుతున్నం త సేపు తమ బాల్యంతో తాము నడిచి వెళ్తున్న అనుభూతిని పొందుతారు. అయితే ఈ కవితా సంపుటికి ఉన్న ప్రత్యేకత నవ మాసాలు మోసిన అమ్మకు, కొడు కే అమ్మైన సందర్భం. ఈ సంపుటిని చదువుతున్నప్పు డు పాఠకుణ్ణి రెండు ఆత్మల్లోకి పరకాయ ప్రవేశం చేపిస్తాడు కవి. అప్పటి వరకు వస్తువులోని అమ్మను తన అమ్మగా, కవి బాల్యాన్ని తన బాల్యంగా ఊహా ప్రపంచంలో విహరిస్తున్న పాఠకుడిని అమ్మ చేయి అలిగింది అన్న కవిత నుంచి తనదైన ప్రపంచంలోకి తీసుకెళ్తాడు కవి. సంపుటిలో నాన్న వస్తువుగా కొన్ని కవితలు సాగి నా, అవి అంతర్లీనంగా తల్లి సంవేదనను తెలియజెప్పే వే. అమ్మతో నేను అనే కవితలో తన కడుపుకు తానే కాపరై అనడం ద్వారా కాపరి అన్న పదానికి మరో భాష్యం చెప్పారు.తన హృదయంతో నా హృదయానికి రక్త సంబంధాన్ని జోడిస్తూ అనడం కవి అంతరాల్లో దాగిన ఆత్మబంధానికి నిదర్శనం. 

ఓ చోట నా ఊతం లేని పరుగు చూపి తాను విజయం సాధించిన ఆనం దం.. అనడంలో పుత్రుడు స్వతంత్రుడైతే తల్లి కళ్ళలో మెరిసే కాంతిని అందంగా చిత్రించాడు కవి. ఎన్ని సార్లు విన్నా, ఎన్ని మార్లు చూసినా తనివితీరని అమ్మ పద ముద్దలను ఈ కవితలో జొప్పించాడు. 
చిరిగినా చొక్కా కవితలో.. నేను ఇంటికి మోసుకెల్లేది/రేగి చెట్ల జ్ఞాపకాలు/కంప చెట్ల గుర్తులు.. అని అభివ్యక్తీకరించడం పల్లెటూరి బాల్యానికి నిదర్శనంగా నిలుస్తూనే, ఈనాటి పట్టణాలలోని పిల్లలు ఏయే జ్ఞాపకాలను, అనుభూతులను కోల్పోతున్నారో చెప్పే సందేశాన్ని చెప్పకనే చెప్పాడు కవి. 
ఓ చోట సూర్యుణ్ణి పిల్లాడితో పోల్చి, భూమిని అమ్మ తో పోల్చి, చక్కని పోలికలను ఆవిష్కరించారు. అప్పటి వరకు తండ్రి,భర్త ప్రపంచంగా ఉన్న ఆమెకు,అమ్మ అయ్యాక ఆ బిడ్డే ప్రపంచమనే అంతర్లీన సహజ భావాల ను ప్రకటించారు. ఓ చోట ఉషోదయ కిరణాలను అమ్మ మాటల తాకిడితో.. పోలిక చేయడం మంచి ప్రతీక. దారి పొడవునా అమ్మ జ్ఞాపకాలు అనే కవిత ఇటు వర్తమానం లో, అటు స్మృతిలో అమ్మ జ్ఞాపకాలతో సాగే చక్కని కవి త. అమ్మను,అమ్మ ప్రేమను ఎన్నో ప్రతీకలతో ఈ కావ్యం లో అక్షరీకరించారీ యువకవి. అమ్మ ప్రేమనే కాదు,ఆ అమ్మ పలుకులకు కారణమైన అమ్మ భాషనూ నాతోనే నాలోనే అమ్మ భాష అంటూ అమ్మే నాలో నిండిపోయిన శ్వాస అన్న అభివ్యక్తి కవిలో అణువణువునా పరిమళిస్తున్న, స్మరిస్తున్న అమ్మ తత్వానికి నిదర్శనం. ఇలా అమ్మే వస్తువుగా, శిల్పంగా, అభివ్యక్తిగా రూపుదిద్దుకున్న ఈ కావ్యం ప్రతీ పాఠకుడికి ఏదో సమయంలో తన తల్లి ని, బాల్యాన్ని గుర్తుకు తెచ్చి కనుల వెంట కన్నీటి చెమ్మల ను మెరిపించగలదు అమ్మ పేరే నా కవిత్వం.
– పరవస్తు విశ్వక్సేన్, 83283 84951

తాజా సమాచారం

Latest Posts

Featured Videos