అయ్యవారమ్మ అయిన ఆయా

అయ్యవారమ్మ అయిన ఆయా

తిరువనంతపురం: కక్కనాడ్ ఇక్బాల్ ప్రాథమికోన్నత పాఠశాల ఆరో తరగతి గదిలోకి వచ్చిన కొత్త ఇంగ్లిష్ టీచర్ను చూసి పిల్లలు ఆశ్చర్య పోయారు. ‘గుడ్మాణింగ్ స్టూడెంట్స్’ అని టీచర్ చెప్పినా పిల్లల నుంచి సమాధానం లేదు. ఆమె పేరు లింజా. తమ బడి పారిశుధ్య కార్మికురాలు ఇప్పుడు ఇలా వచ్చారేమిటనేది పిల్లల మెదడును తొలిచిన ప్రశ్న. ఆమె పురోగతి యువతకు ప్రోత్సాహదాయిని. లింజా తండ్రి రాజన్ ఇక్బాల్ స్కూల్లోనే సంస్కృతం టీచర్గా పని చేస్తున్నపుడు లింజా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. 2001లో రాజన్ హఠాత్తుగా మరణించారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆమెకున్న విద్యార్హతలను బట్టి ఖాళీగా పారిశుధ్య కార్యికురాలి ఉద్యోగాన్నిచ్చారు. ఆ పని చేస్తున్నవారు దీర్ఘకాలపు సెలవుపై వెళ్లటంతో అదయినా దక్కింది. తమ్ముడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కుటుంబాన్నీ పోషించాలి. ఇంకేం ఆలోచించకుండా పారిశుధ్య కార్మికురాలిగా చేరిపోయారు. దీర్ఘకాల సెలవు పెట్టిన వాళ్లు 2006 తిరిగి రావటంతో నిరద్యోగిగా మారింది. అయితే ఆమె స్కూల్లో పని చేస్తూనే బి.ఎ.; ఎం.ఎ. ఇంగ్లిష్, బి.ఇడి. పట్టాల్ని సాధించారు. ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లిష్ పాఠాల్ని బోధిస్తున్నారు. తిరిగి కొంత కాలానికి ఆమెకు బడి నుంచి పిలుపు వచ్చింది. మళ్లీ అదే స్వీపర్ పోస్టా? నేనేమిటి? అని మొదటి సారిగా అనుకుంది. కానీ రెండో సారి పారిశుధ్య కార్మికురాలిగా చేరింది. పనిపై తనకున్న గౌరవం అది. ఆ ఉద్యోగం చేస్తూనే టీచర్స్ ఎలిజబిలిటీ టెస్ట్ రాసి, పాస్ అయ్యారు. ‘స్టేట్ ఎలిజబిలిటీ టెస్ట్’ కూడా రాయమని ప్రధానోపాధ్యాయురాలు ప్రవీణ ప్రోత్సహించారు. అప్పటికే ఆమెకు ఆరేళ్ల కొడుకు, నెలల వయసున్న కూతుర్ని చూసుకోవాలి. దీంతో పరీక్ష రాయలేను మేడమ్ అన్నారు లింజా. ‘వాళ్లిద్దర్ని కూడా స్కూల్కి తెచ్చేయ్. నేను చూసుకుంటాను. నువ్వు పరీక్షకు తయారు కా’ అన్నారు ప్రవీణ. అంతకన్నా కావల్సిందేముంది. స్టేట్ టెస్ట్ కూడా పూర్తయింది. టీచర్గా అదే స్కూల్లో పోస్టింగ్ వచ్చింది. ‘చూస్తుండండి.. ఇదే స్కూల్కి లింజా ఏనాటికైనా హెడ్మిస్ట్రెస్ అవుతారు’అని అన్నారు ప్రవీణ దరహాసంతో.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos