కార్మిక చట్టాలపై ముందుకు

కార్మిక చట్టాలపై ముందుకు

న్యూఢిల్లీ : వివాదాస్పద నూతన కార్మిక చట్టాల అమలు విషయంలో మోడీ సర్కారు ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఈ చట్టాల అమలుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఇవి కార్మిక వ్యతిరేక చట్టాలనీ, వీటిని వెనక్కి తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు ఇప్పటికే డిమాండ్‌ చేశాయి. అయితే, కేంద్రంలోని మోడీ సర్కారు ఇవేమీ పట్టించుకోకుండా చట్టాల అమలుకే సై అంటున్నది. ఇది కార్మిక సంఘాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. దీంతో దేశవ్యాప్త నిరసనలకు ట్రేడ్‌ యూనియన్లు సిద్ధమవుతున్నాయి.కోడ్‌ ఆన్‌ వేజెస్‌, ఇండిస్టీయల్‌ రిలేషన్స్‌ కోడ్‌, కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీ, ఆక్యుపేషనల్‌ సేఫ్టీ, హెల్త్‌ అండ్‌ వర్కింగ్‌ కండిషన్స్‌ కోడ్‌.. ఈ నాలుగు చట్టాల కోసం నిబంధనలు రూపొందించటాన్ని వేగవంతం చేయటానికి గత ఆరు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్‌ మాండవీయ అనేక సమావేశాలను ఏర్పాటు చేస్తోన్నారు. ‘లేబర్‌’ అనే అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నది. కాబట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిబంధనలను రూపొందించాల్సి ఉంటుంది. కేంద్రం, పలు రాష్ట్రాలు ఇప్పటికే ముసాయిదా నిబంధనలను పబ్లిష్‌ చేశాయి.ఈ నేపథ్యంలో కార్మిక చట్టాలను అమలు చేయటానికి కేంద్రం యోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. వచ్చేనెల నుంచి ప్రారంభం కానున్న 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి దగ్గరలోనే వీటిని అమలు చేయొచ్చని సమాచారం. ”ఆందోళనల పరిష్కారానికి రాష్ట్రాలు, ట్రేడ్‌ యూనియన్లతో సమావేశాలు జరుగుతోన్నాయి. నాలుగేండ్ల క్రితమే కేంద్రం ముసాయిదా నిబంధనలను నోటిఫై చేసింది. 2025-26 ప్రారంభంలో చట్టాల అమలుకు ప్రభుత్వం ఆసక్తితో ఉన్నది” అని ఒక అధికారి చెప్పారు.నూతన కార్మిక చట్టాలు ప్రస్తుతమున్న 29లేబర్‌ చట్టాలను రీప్లేస్‌ చేస్తాయనీ, ఇవి కార్మికులను దెబ్బతీస్తాయని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కె.ఎన్‌ ఉమేశ్‌, కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్‌టీయూసీ జనరల్‌ సెక్రెటరీ అశోక్‌ సింగ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఆమోదానికి ముందు నాలుగు చట్టాలపై ఇండియన్‌ లేబర్‌ కాంగ్రెస్‌ (ఐఎల్‌సీ)లో చర్చించలేదని అశోక్‌ సింగ్‌ అన్నారు. 2015 నుంచి ఐఎల్‌సీ సమావేశమే జరగలేదని గుర్తు చేశారు.   రూల్స్‌ను నోటిఫై చేసిన రోజే నిరసనలు చేసే ప్రదేశాల వద్ద లేబర్‌ కోడ్‌ల ప్రతులను దహనం చేస్తామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఉమేశ్‌ అన్నారు. మేలో సార్వత్రిక సమ్మె జరుగుతుందని వివరించారు. కేంద్ర వ్యవసాయ పాలసీలపై ప్రస్తుతం నిరసనలు చేస్తోన్న రైతు సంఘాలు కూడా ట్రేడ్‌ యూనియన్ల నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపాయని చెప్పారు. అయితే, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్‌ మాత్రం ట్రేడ్‌ యూనియన్ల ఆందోళనలకు దూరంగా ఉంటున్నది. తాము ఏ నిరసనల్లోనూ పాలుపంచుకోవటం లేదని బీఎంఎస్‌ నార్త్‌జోన్‌ సెక్రెటరీ పవన్‌ కుమార్‌ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos