అన్నీ తామై…

గర్భిణులకు ఆరోగ్యసూత్రాలు వివరించడం మొదలు… బాల్యవివాహాలు ఆపడం, పిల్లల్ని బడిమానేయకుండా చూడటం వరకూ… ఎన్నో బాధ్యతలు అంగన్‌వాడీ టీచర్లదే. వాటన్నింటినీ విజయవంతంగా పూర్తిచేశారు వీళ్లు. ఆ కృషే వీళ్లకు గుర్తింపు తెచ్చింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది అంగన్‌వాడీ టీచర్లు ఉన్నా… తెలుగురాష్ట్రాల నుంచి వీళ్లు అరుదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతకీ వాళ్లెవరు… వాళ్లకొచ్చిన గుర్తింపు ఏంటంటే…
‘గ్రామాభివృద్ధే.. దేశాభివృద్ధి… గ్రామీణుల ఆరోగ్యాన్ని కాపాడటం మా లక్ష్యం’ అని చెప్పే ఈ అంగన్‌వాడీ టీచర్లు తాజాగా జాతీయస్థాయిలో గుర్తింపు సాధించారు. సోమవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ నుంచి అవార్డులు అందుకొన్నారు. దేశవ్యాప్తంగా 97 మందికి గుర్తింపు వస్తే… తెలంగాణాలో ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నలుగురు ఈ అవార్డుల్ని అందుకున్నారు.
ఆమె పేరు సుశీల. తెలంగాణ ఖమ్మం జిల్లా, ఏన్కూరులో 26 ఏళ్లగా అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. సుశీల చదివింది పదో తరగతే. మాతాశిశువు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, గర్భిణులకు పోషకాహారం అందేలా చూడటం… పుట్టిన పాపాయికి వ్యాధినిరోధక టీకాలు వేయించడం వీళ్ల విధుల్లో భాగం. వీటన్నింటితోపాటు బాల్యవివాహాలను అరికట్టడంలో ఎక్కువగా కృషి చేసింది. ‘కూలీ పనులకు వెళ్లే పిల్లల్ని, బడిమానేసిన వారిని గుర్తించి మళ్లీ చదువుకునేలా చేశా. పిల్లలకే కాదు, తల్లిదండ్రులకు కూడా చదువు విలువ చెబుతా. క్రమంగా చాలామంది తల్లిదండ్రులు, పిల్లల్లో మార్పు వచ్చింది. చిన్నారుల్ని చదువుకునేలా చేయడమే నా పని. అంటే వాళ్లకు పరోక్షంగా మంచి భవిష్యత్తును ఇస్తున్నట్లేగా. అంతకన్నా కావాల్సిందేముంటుంది…’ అని చెబుతుంది సుశీల. ఆమెది వ్యవసాయ నేపథ్యం. బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తితోనే ఇందులో చేరింది. తన ఇద్దరమ్మాయిల్ని చదివించుకుంటోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos