మనసు,కళ్లకు ఆహ్లాదం పంచే కుంతిబెట్ట..

  • In Tourism
  • January 10, 2020
  • 287 Views
మనసు,కళ్లకు ఆహ్లాదం పంచే కుంతిబెట్ట..

కర్ణాటక రాష్ట్రంలో చెరకు,వరి పంటలకు,ముచ్చటగొలిపే బొమ్మలకు,కావేరి నది పరవళ్లకు చిరునామాగా నిలుస్తున్న మండ్య జిల్లాలో చెప్పుకోదగిన పర్యాటక ప్రాంతాల్లో కుంతిబెట్ట కూడా ఒకటి.జిల్లాలోని పాండవపుర పట్టణానికి సమీపంలోనున్న కుంతిబెట్ట వారాంతాల్లో విహారయాత్రకు చక్కటి ప్రదేశం.రెండు రోజుల పాటు కుటుంబంతోనే లేదా స్నేహితులతోనే ట్రెక్కింగ్‌,ర్యాపెల్లింగ్‌ తదితర క్రీడలతో ఉల్లాసంగా గడిపిరావచ్చు.చెరకు తోటలు,పచ్చటి వరిపొలాలు,ఎటు చూసిన ఎత్తైన కొబ్బరిచెట్లు అక్కడక్కడా చెరువులు,నీటికాలువలతో కుంతిబెట్ట చూడగానే మనసుకు,కళ్లకు ఆహ్లాదం పంచుతుంది.

కుంతిబెట్ట చుట్టూ పచ్చటి దృశ్యాలు..

కుంతిబెట్ట చుట్టూ పచ్చటి దృశ్యాలు..

వాటి మధ్యలో స్వచ్ఛమైన గాలులు పీల్చుకుంటూ సుమారు మూడువేల అడుగుల ఎత్తు ఉన్న కుంతిబెట్టపైకి ట్రెక్కింగ్‌ చాలా అద్భుతంగా ఉంటుంది.కుంతిబెట్టపై అక్కడక్కడా పాత్ర ఆకారంలో చెక్కిన రాళ్లు కనిపిస్తాయి.అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు ఇక్కడ కొద్దికాలం ఉన్నారని ఆ సమయంలో ఆహారం వండడానికి ఇక్కడిరాళ్లను పాత్రల ఆకారం మలిచారని స్థానిక చరిత్ర.దీన్ని బలపరుస్తూ కుంతిబెట్టపై ఉన్న భారీ పాదముద్రలు భీముడివని స్థానికులు చెబుతారు.పాండవుల తల్లి కుంతిపేరు మీదుగా పాండవులు ఈ ప్రాంతానికి కుంతిబెట్టగా నామకరణం చేశారని స్థానిక చరిత్ర.ఎటు చూసిన పచ్చటిపొలాలు,కొబ్బరిచెట్లతో దర్శనమిచ్చే కుంతిబెట్ట సాహసక్రీడ రాపెల్లింగ్‌ అనువైన ప్రదేశం.

కుంతిబెట్టపై అమ్మాయి రాక్‌క్లైంబింగ్‌..

950 మీటర్ల ఎత్తున్న కుంతిబెట్టపై రాపెల్లింగ్‌,రాక్‌క్లైంబింగ్‌ చేయడానికి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సాహసక్రీడా ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు.కుంతిబెట్టపై క్యాంపింగ్‌ జీవితంలో మరచిపోలేని అద్వితీయమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.రాత్రి వేళల్లో కుంతిబెట్టపైకి ట్రెక్కింగ్‌ కచ్చితంగా మరచిపోలేని అనుభవంగా మిగిలిపోతుంది.కొండ లోయలో ఉన్న సరస్సు ఒడ్డున గుడారాలు ఏర్పాటు చేసుకొని క్యాంప్‌ఫైర్‌(చలిమంటలు)వద్ద వెన్నెల్లో భోజనం చేయడం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా మాటలు అందవు.

కుంతిబెట్టపై అమ్మాయిల నైట్ ట్రెక్కింగ్..

కుంతిబెట్టకు కూతవేటు దూరంలోనున్న తొన్నూరు సరస్సులో స్వచ్ఛమైన నీటిలో ఈతకొట్టడం కూడా మరచిపోలేని అనుభవమే.కావేరి నదిపై నిర్మించిన కేఆర్‌ఎస్‌ జలాశయం వెనుకనీటి ద్వారా ఏర్పడ్డ ఈ సరస్సులో ఏడాది పొడవునా నీరు ఉంటుంది.ఈ సరస్సులో ఈత మాత్రమే కాదు కయాకింగ్‌,బోటింగ్‌ కూడా అద్భుతంగానే ఉంటుంది.కుంతిబెట్టకు వచ్చే పర్యాటకులు కావేరి నదీ వెనుకజలాల్లో కయాకింగ్‌ చేయడం మాత్రం మిస్‌ చేసుకోవద్దు.దీంతోపాటు కావేరి నదిలో బోటింగ్‌,ఫిషింగ్‌(చేపలపట్టడం)కూడా ఆహ్లాదభరితంగా ఉంటాయి.

తొన్నూరు సరస్సు..

తొన్నూరు సరస్సులో బోటింగ్‌..

కుంతిబెట్టపై సూర్యాస్తమయం,సూర్యోదయం చూడడం నిజంగా మాటల్లో వర్ణించలేని అనుభవం.రెండు కొండల మధ్య తూరుపు కనుమల్లో బంగారు వర్ణంలో మెరుస్తూ సూర్యుడు ఉదయించే దృశ్యం చూడడానికి రెండుకళ్లూ చాలవు.కుంతిబెట్ట దిగువ భాగంలో పురాతన కుంతి ఆలయం స్థానికంగా చాలా ప్రసిద్ధి చెందింది.ప్రతిరోజూ పూజలు నిర్వహించడానికి,దర్శనానికి వచ్చే భక్తులతో పాటు కుంతిబెట్ట విహారానికి వచ్చే పర్యాటకులు సైతం ఆలయాన్ని సందర్శించి ట్రెక్కింగ్‌ మొదలుపెడతారు..

అందమైన సూర్యోదయం..

 

కుంతి ఆలయం..


కుంతిబెట్టపై చూడదగ్గ మరిన్ని ప్రదేశాల గురించి తెలుసుకుంటే..
పరిక్రమ పాయింట్‌..
కుంతిబెట్ట శిఖరం అంచు భాగాన్ని పరిక్రమ పాయింట్‌గా పిలుస్తారు.ఇక్కడి నుంచి చుట్టూఉన్న ప్రకృతి అందాలు తిలకిస్తూ వాటిని ఆస్వాదించవచ్చు.పొగమంచు మధ్య పచ్చటి పొలాలు,కావేరి నదీ వెనుక జలాలు,కాలువలు,పక్షులు,కొండలు,ఎత్తైన కొబ్బరిచెట్లు ఇలా ప్రతిఒక్కటీ నయనమనోహరంగా ఉంటాయి.

పరిక్రమ పాయింట్ అంచున అమ్మాయి..

కుంతి కుండ్‌..
కుంతి బెట్ట పాదాల వద్ద నీలాకాశం రంగులో ఎల్లప్పుడూ జలకళతో దర్శనమిచ్చే కుంతికుండ్‌ అనే చిన్న జలాశయం అబ్బురపరుస్తుంది.కొండల దిగువన ఉండడంతో ఈ జలాశయంలోని నీరు ఎల్లవేళలా చాలా చల్లగా ఉంటూ అందులో దిగగానే మనసుకు,ఒంటికి గిలిగింతలు పెడుతుంది. జలాశయం చుట్టూ ఉండే ప్రతి చెట్టూ ఆశ్చర్యపరుస్తుంది.కుంతిబెట్ట నుంచి అలా కొద్దిదూరం ప్రయాణిస్తే కొండలపై ఒంపులు తిరుగుతూ ప్రవహించే కావేరి నది,వందల అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే జలపాతాలు సైతం దర్శనమిస్తాయి..

కుంతిబెట్ట సమీపంలో జలపాతం..


ఎలా చేరుకోవాలి..
బెంగళూరు నుంచి బస్సు లేదా రైలు మార్గంలో పాండవపురకు చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో కుంతిబెట్టకు చేరుకోవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos