ప్రకృతి సృష్టించిన అద్భుతం..కుమార పర్వతం..

ప్రకృతి సృష్టించిన అద్భుతం..కుమార పర్వతం..

కర్ణాటక రాష్ట్ర ఆదాయంలో కీలకపాత్ర పోషిస్తున్న పర్యాటక రంగానికి మలెనాడు జిల్లాలు వెన్నెముకగా నిలుస్తున్నాయి. చిక్కమగళూరు, హాసన్‌,కొడగు,కూర్గ్‌,మైసూరు తదితర మలెనాడు పరిధిలోకి వచ్చే జిల్లాలు అణువణువు ప్రకృతి అందాలతో అలరారుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.మలెనాడు పరిధిలోని దట్టమైన పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్న దక్షిణ కన్నడ జిల్లాలో కూడా లెక్కలేనన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.అందులో ఒకటి కుమార పర్వతం.దీన్ని కుమారపర్వతం లేదా పుష్పగిరి పర్వతం అని కూడా పిలుస్తుంటారు.దక్షిణకన్నడ జిల్లా సుళ్య తాలూకాలోని ప్రముఖ ఆధ్యాతిక క్షేత్రమైన కుక్కె సుబ్రహ్మణ్య ఆలయానికి సమీపంలో ఉన్న కుమార పర్వతం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుటుంది.

కుమార పర్వతపై సెలయేరు..

పచ్చతివాచీలా కుమార పర్వతం..

సాధారణ జాతులతో పాటు మరెన్నో అరుదైన వృక్షజాతులతో గుబురుగా,దట్టంగా ఉన్న అభయారణ్యంతో 13 కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు ఆరు వేల అడుగుల ఎత్తు కలిగిన కుమార పర్వత శిఖరం దక్షిణాదిలోనే అత్యంత క్లిష్టమైన పర్వతంగా ప్రసిద్ధి చెందింది.కుమార పర్వతం కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన పర్వతాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.దూరం నుంచి చూడడానికి ఒకే పర్వతంలా కనిపించినా కుమార పర్వతం అనేక శిఖరాల సమూహంగా ఉంటుంది.శేష పర్వతం,సిద్ధ పర్వతం,కుమార పర్వతం మూడు శిఖరాల సమూహంగా కుమార పర్వతం లేదా పుష్పగిరి పర్వత శిఖరం ఏర్పడింది.కుమార పర్వతం ట్రెక్కింగ్‌ ఎన్న సవాళ్లతో కూడుకుకొని ఉంటుంది.దట్టమైన అడవిలో ఎదురయ్యే సవాళ్లు,ప్రతికూలతలు దాటుకుంటూ ఒక్కసారి పర్వతం అంచుకు చేరుకుంటే అప్పటివరకు పడ్డ శ్రమ మరచిపోయి కొద్ది రోజులైనా ప్రకృతి అందాలు చూస్తూ అక్కడే ఉండిపోవాలనే భావన కలుగుతుంది.

పచ్చ తివాచీలా కుమారపర్వతం..

ట్రెక్కింగ్‌లో అలసట వస్తే కూర్చోవడానికి బెంచీలు..

ఆకాశాన్ని తాకే పర్వతం అంచుల్లో,పర్వతం అంచుపై తనువును చల్లగా స్పృశించే మేఘాల పలకరింపులతో,అప్పుడప్పుడూ కురిసే చిరుజల్లుల మధ్య పచ్చటితివాచి కప్పుకొన్న కుమార పర్వతం లోయలు చూడాలంటే రెండు కళ్లూ చాలవేమో. కుమారపర్వతం,శేష పర్వతం అంచులకు చేరుకోగలిగినా మూడో శిఖరమైన సిద్ధ పర్వతం మాత్రం ట్రెక్కింగ్‌కు ఏమాత్రం అనుకూలం కాదు.మిగిలిన రెండు పర్వత శిఖరాలతో పోలిస్తే సిద్ధ పర్వతం మరింత దట్టంగా ఉంటూ అడుగడుగునా సవాళ్లు విసురుతుంది.శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడైన విష్ణు తీర్థ ఆచార్య సిద్ధ పర్వతంపై తపస్సు చేశాడని స్థానిక చరిత్ర.కుమార పర్వత శిఖరాన్ని దక్షిణకన్నడతో పాటు ఉడుపి,హాసన్‌ జిల్లాలు కూడా సరిహద్దులుగా కలిగిఉన్నాయి.దీంతో కుమార పర్వతం ఈ మూడు జిల్లాల పర్యాటక పరిధిలోకి వస్తుంది.సుమారు ఆరు వేల అడుగుల ఎత్తు కలిగిఉన్న నేపథ్యంలో కుమార పర్వత శిఖరంపై వాతావరణ ఎల్లప్పుడూ చల్లగా,పొడిగా ఉంటుంది.వర్షాకాలమైన జూన్‌ నుంచి నవంబర్‌ వరకు ఈ ప్రాంతంలో సుమారు 3,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది.ఇంత భారీస్థాయిలో వర్షపాతం కురవడంతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ పచ్చగా,నిండైన జలపాతాలతో కనువిందు చేస్తుంది.

గలగల జలపాతం..

కుమారపర్వతంపై యువత ట్రెక్కింగ్..

కుమారపర్వతంపై యువత ట్రెక్కింగ్..

నవంబర్‌ నుంచి వర్షాకాలం మొదలయ్యే వరకు కుమారపర్వతం విహారయాత్రకు చాలా అనుకూలంగా ఉంటుంది.వేసవితో సహా అన్ని రుతువుల్లోనూ ఉష్ణోగ్రతలు ఏడు డిగ్రీల నుంచి 29 డిగ్రీలలోపే ఉండడంతో కుమార పర్వత విహారానికి పర్యాటకులు ఆసక్తి కనబరుస్తుంటారు.కుమార పర్వతం వెనుక పురాణగాథ ఒకటి ఉన్నట్లు తెలుస్తోంది.రాక్షస జాతి సంహారం అనంతరం షణ్ముఖుడు తన సోదరుడు వినాయకుడితో కలసి ఇక్కడి పర్వతానికి చేరుకున్నాడు.రాక్షసజాతి సంహారంతో సంతుష్టుడైన అమరపురి అధినేత ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను వివాహం చేసుకోవాలని కుమారస్వామిని ప్రార్థించగా ఈ పర్వతం వద్దే వివాహం జరగడంతో ఈ ప్రాంతానికి కుమారపర్వతగా పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు.కుమార పర్వతపై ఉన్న పుష్పగిరి వైల్డ్‌లైఫ్‌ సాంక్చువరి తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.సాంక్చువరీలో కుందేళ్లు,చుక్కల జింకలు,ఎగిరే ఉడుతలు,ఇండియన్‌ వైల్డ్‌డాగ్‌,ట్రావెన్‌కోర్‌ ఎగిరే ఉడుతలు,బ్రౌన్‌ పామ్‌ కేవియట్‌,ఇండియన్‌ ఉడుతలు,ముంగీసలు,సాంబార్‌ జింకలు,ఏషియన్‌ అడవి ఏనుగులు,అడవి దున్నలు,ఇండియన్‌ జింకలు,మూషిక జింకలు చూడవచ్చు.వీటితో పాటు చింపాంజిలు,కొండముచ్చులు తదితర వానర జాతులను కూడా చూడొచ్చు.ఇక కుమారపర్వత విహారయాత్రలో మల్లల్లి,అబ్బే జలాపాతాలు కూడా తప్పకుండా చూడాల్సిందే.

కుమారపర్వతంపై పొమంచులో ట్రెక్కింగ్..

శిఖరం అంచున్న అమ్మాయి..

వైల్డ్‌లైఫ్‌ సాంక్చువరీలో చిరుత..

ఎలా చేరుకోవాలి?
బెంగళూరు నుంచి రోడ్డు లేదా రైలు మార్గం మీదుగా మంగళూరు లేదా కూర్గ్‌ చేరుకోని అక్కడి నుంచి వాహనాల్లో కుక్కె సుబ్రహ్మణ్య లేదా సోమవారపేటకు చేరుకోవాలి.ఈ రెండు ప్రాంతాల నుంచి సుమారు ఎనిమిది గంటల పాటు ట్రెక్కింగ్‌ చేసి కుమారపర్వతం శిఖరం అంచులకు చేరుకోవాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos