ప్రకృతి అందాల రాజధాని కుద్రేముఖ్..

  • In Tourism
  • January 23, 2020
  • 373 Views
ప్రకృతి అందాల రాజధాని కుద్రేముఖ్..

క్షణం కూడా రెప్ప వేయనివ్వకుండా ఆహ్లాదపు ప్రపంచంలో తేలియాడించే ఎన్నో పర్యాటక ప్రదేశాలకు నిలయమైన మలేనాడు ప్రాంతంలోని కీలకమైన చిక్కమగళూరు జిల్లాలో కుద్రేముఖ్పర్వతం అగ్రస్థానంలో ఉంటుంది.దేశవిదేశాల నుంచి సైతం కుద్రేముఖ్పర్వతంపై ట్రెక్కింగ్కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.ఇక బెంగళూరు నగరంలోని సాధారణ యువతతో పాటు సాఫ్ట్వేర్ఉద్యోగులు సైతం ఉద్యోగంలో ఎదురయ్యే ఒత్తిళ్ల నుంచి రెండురోజుల ఉపశమనం పొందడానికి కుద్రేముఖ్ట్రెక్కింగ్కు ప్రతివారం వస్తుంటారు.కుద్రే అంటే తెలుగులో గుర్రం అని అర్థం.గుర్రపు ముఖం ఆకారంలో ఉండడంతో ప్రాంతానికి కుద్రేముఖ్అనే పేరు వచ్చింది.సముద్ర మట్టానికి సుమారు 1,894 మీటర్ల ఎత్తులో ఉండే కుద్రేముఖ్పచ్చికబయల్లు,గడ్డి భూములు,నిటారుగా పెరిగిన అరుదైన వృక్షాలతో క్లిష్టతరంగానూ అంతే అందంగా,ఆహ్లాదంగా కూడా ఉంటుంది.

కుద్రముఖ్ పర్వత అందాలు..

కుద్రముఖ్ పర్వత అందాలు..

ట్రెక్కింగ్లో అలసట వస్తున్నా కళ్లెదురుగా కనిపించే ప్రకృతి అందాలు,చల్లగా తాకే మేఘాలు, స్వచ్ఛమైన గాలులు ఇవన్నీ అలసటను మరపించి మనసులను మురిపిస్తాయి.మల్లంగిరి పర్వతం అనంతరం కర్ణాటక రాష్ట్రంలో రెండో అతిఎత్తైన శిఖరంగా కుద్రేముఖ్‌ పేరుగాంచింది.ఇదే ప్రాంతంలో 1,458 మీటర్ల ఎత్తుతో ఉండే వరాహ పర్వతం కూడా ట్రెక్కింగ్కు చాలా ప్రసిద్ధి చెందింది.అంతేకాదు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో వరాహ పర్వతానికి స్థానం కూడా ఉంది.కుద్రేముఖ పర్వతారోహణంలో తన్మయత్వం పంచే ప్రకృతి అందాలతో పాటు పెద్దపులులు,చిరుతపులలు తదితర వన్యప్రాణాలు అక్కడక్కడా తారసడి గంభీరంగా స్వాగతం పలుకుతాయి. ప్రయాణంలో కాఫీ తోటలు వెదజల్లే ఘుమఘుమలు మరో లోకానికి తీసుకెళతాయి.

కాఫీ తోటల్లో బంగ్లా..


దారి మధ్యలో దర్శనమిచ్చే జలపాతాలు,జలప్రవాహాలు,సెలయేళ్లు ఒకటేమిటి ట్రెక్కింగ్‌ ఆసాంతం అద్భుతాలు,ఆహ్లాద పరిమళాలు ఎదురవుతాయి.ఏడాదిలో సరాసరి ఏడువేల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో కుద్రేముఖ్‌ ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటూ ఏడాదిపొడవునా చల్లటి వాతావరణాన్ని కలిగి ఉంటుంది.ఈ కారణంగానే ఏడాది పొడవుగా పర్యాటకులు కుద్రేముఖ్‌ పర్యటనకు ఆసక్తి కనబరుస్తారు.వర్షాకాలంలో కొద్దిపాటి జాగ్రత్తలు వహిస్తే కుద్రేముఖ్‌ ట్రెక్కింగ్‌ జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభవంగా మిగులుతుంది.

అమ్మాయి తన్మయత్వం..

ఇంతకంటే స్వర్గామా!

కుద్రముఖ్‌ శిఖరానికి మరో ప్రత్యేకత కూడా ఉంది.జీవవైవిధ్య పరిరక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన 31 హాట్‌స్పాట్‌లలో కుద్రేముఖ్‌ కూడా ఒకటి.దీంతోపాటు వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌ సొసైటీ,వరల్డ్‌వైడ్‌ ఫండ్‌-యూఎస్‌ఏ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రదేశాల్లో కుద్రేముఖ్‌ నేషనల్‌ పార్క్‌ గ్లోబల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ ప్రియారిటీ-1 కిందకు వస్తుంది.తుంగా,భద్ర,నేత్రావతి మూడు నదులు ప్రవహిస్తున్న నేపథ్యంలో కుద్రేముఖ్‌లో జలపాతాలు విరివిగా దర్శనమిస్తాయి.ముఖ్యంగా హనుమాన్‌గుండి,కదంబి జలాశయాలు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు.ఇక కుద్రేముఖ్‌లో పెద్దపులలు,చిరుతలతో పాటు అడవినక్కలు,మలబార్‌ సివెట్స్‌,అడవికుక్కలు,బద్దకపు ఎలుగుబంట్లు,మచ్చలజింకలు ప్రధానంగా కనిపిస్తాయి.

కొండల మధ్యలో సెలయేరు గలగలలు..

అడవి మధ్యలో వేలాడె వంతెన..

కుద్రేముఖ్‌ ట్రెక్కింగ్‌లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుంటే..

హనుమాన్‌గుండి జలపాతం..
సహజసిద్ధంగా ఏర్పడ్డ రాళ్ల మధ్య ప్రవహిస్తూ సుమారు 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు నుంచి కిందకు వయ్యారంగా జాలువారే హనుమాన్‌గుండి జలపాతం నేత్రానందంగా ఉంటుంది.ట్రెక్కింగ్‌ చేసి అలసిపోతే హనుమాన్‌గుండి జలపాతం కిందనున్న కొలనులో స్వచ్ఛమైన నీటిలో ఈత కొడితే అంతకు మించిన స్వర్గం లేదనిపిస్తుంది..

హనుమాన్‌గుండి జలపాతం..

గంగమూల..
వరాహ శిఖరంపైనున్న భగవతి ఆలయం,ఆరు అడుగుల పొడవైన వరాహ చిత్రంతో కూడిన గుహ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.మాగ్నటైట్‌-క్వార్ట్జ్‌ నిక్షేపాలతో తులతూగే ఈ ప్రాంతంలో 107కు పైగా అరుదైన పక్షుల జాతులు నివస్తిన్నాయి.జీవవైవిధ్యం కలిగిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు కూడా దక్కింది.ఈ ప్రాంతంలోనే తుంగ,భద్ర,నేత్రావతి మూడు నదులను ఒకే ప్రాంతంలో చూడవచ్చు..

గంగమూలకు దారి..

కుద్రేముఖ్‌ ట్రెక్కింగ్‌..
అటవీశాఖ అనుమతులు తీసుకుంటే కుద్రేమఖ్‌ శిఖరంపైనే చుట్టుపక్కనున్న మరిన్ని పర్వతాలపై ట్రెక్కింగ్‌ చేయవచ్చు.కురింజల్‌ పీక్‌,గంగాడికల్‌ పీక్‌,సీతాభూమి,వాలికుంజ్‌,సీతాభూమి,నరసింహపర్వత ముఖ్యమైన ట్రెక్కింగ్‌ ప్రదేశాలు..

కుద్రేముఖ్ ట్రెక్కింగ్..

లాక్యా ఆనకట్ట..
భద్ర నదికి ఉపనది అయిన లక్యా నది మీదుగా నిర్మించిన లక్యా ఆనకట్ట కూడా తప్పకుండా చూడాల్సిన ప్రదేశమే.వంద మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ ఆనకట్ట కొండ భూభాగాలు,తిరుగులేని ప్రకృతి అందంతో పర్యాటకను అమితంగా ఆకర్షిస్తుంది.వీటితో పాటు కుద్రముఖ్‌ జాతీయ ఉద్యానవనం,కలేశ్వర దేవి ఆలయం,కలసా చెరువు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు..

లాక్య ఆనకట్టలో వెనుకనీరు..

ఎలా చేరుకోవాలి..
బెంగళూరు నుంచి రోడ్డు మార్గం మీదుగా కలసా పట్టణం చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ లేదా ప్రైవేటు వాహనాల్లో బాలేగల్‌ చేరుకోవాలి.అక్కడి నుంచి నడక ద్వారా కుద్రేముఖ్‌ ట్రెక్కింగ్‌ ప్రారంభించవచ్చు.రైలు మార్గం మీదుగా చేరుకోవాలంటే బెంగళూరు నుంచి మంగళూరు చేరుకొని అక్కడి నుంచి కలసా చేరుకోవాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos