కర్ర సాములో చిచ్చర పిడుగు

హొసూరు : అతని వయసు నాలుగేళ్లే. కర్ర సాములో పెద్ద ఆరిందలా అతడు చేసిన విన్యాసాలు…ఇంత చిన్న వయసులోనే అతనికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి. ప్రపంచ స్థాయి పోటీల్లో విజేతగా నిలవడమే కాకుండా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. కృష్ణగిరి జిల్లా హొసూరు సమీపంలోని సూలగిరి విజిపి నగర్‌లో నివాసముంటున్న విద్యాలక్ష్మి, సెంథిల్‌ల ముద్దుల కొడుకు తరశ్విన్(4). శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. చిన్న వయసులో కొంత మంది పిల్లలకు ఇది సహజమేనని, ఇలాంటివారిని ఎక్కువగా ఆటలాడించాలని వైద్యుడు సూచించారు. ఆ సలహా మేరకు తరశ్విన్ తండ్రి అతనికి కర్రసాము నేర్పించాలని ఓ గురువు వద్ద చేర్పించాడు. కర్ర సాము నేర్పుతున్న మాస్టారు అతని శ్రద్ధాసక్తులు గమనించాడు. ప్రత్యేక దృష్టి సారించి, బాగా తర్ఫీదునిచ్చాడు. అలా అతనిని జిల్లా స్థాయి కర్ర సాము పోటీలకు సిద్ధం చేశాడు. ఆ పోటీల్లో నెగ్గిన తరశ్విన్ తరువాత గోవాలో జరిగిన రాష్ట్ర స్థాయి,జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇటీవల సేలంలో జరిగిన ప్రపంచ స్థాయి కర్ర సాము పోటీల్లో కూడా ప్రథముడుగా నిలిచాడు. తద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. మూడేళ్ల ప్రాయంలో కర్ర సాము నేర్చుకోవడానికి వెళ్లిన తరశ్విన్ ఏడాది లోపే ప్రపంచ విజేతగా నిలవడం అందరినీ అబ్బురపరిచింది. తనయుని సాధనలను చూసి తలిదండ్రులు మురిసిపోతున్నారు.

తాజా సమాచారం