న్యూ ఢిల్లీ: బిహార్‌లోని నవాడ జిల్లాలో దళితులపై జరిగిన హింసను అడ్డుకోవడంలో ఎన్డీయే డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. దళితుల పట్ల బీజేపీ వివక్షను ఈ ఘటన వెల్లడిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఓ ఆస్తి వివాదంలో నవాడలోని దళితవాడలో 25 మంది దళితుల ఇండ్లను దగ్ధం చేసిన ఘటనను ఖర్గే ఖండించారు. నవాడలోని దళితవాడలో భయోత్పాతం సృష్టించారు..ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఆటవిక పాలనకు ఇది నిదర్శనమని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాదాపు 100 దళితుల ఇండ్లకు నిప్పంటించారని, కాల్పులు జరిపారని, అర్ధరాత్రి పేదల ఇండ్లను లూటీ చేశారని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్‌లో శాంతిభద్రతలను కాపాడటంలో జేడీయూ, బీజేపీతో కూడిన డబుల్ ఇంజిన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.దళితులు, అణగారినవర్గాల ప్రయోజనాలు కాపాడటంలో బీజేపీ దాని మిత్రపక్షాలు నేరపూరిత నిర్లక్ష్యం ప్రదర్శించాయని విమర్శించారు. బిహార్‌లో సంఘవిద్రోహ శక్తుల ఆగడాలకు ఎన్డీయే ప్రభుత్వం ఊతమిస్తోందని ఆరోపించారు. దళితులపై దమనకాండ జరిగినా ప్రధాని మోదీ యధాప్రకారం మౌనం దాల్చారని మండిపడ్డారు. నితీష్ కుమార్ అధికార దాహంతో ఇవేమీ పట్టించుకోరని, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మౌన ప్రేక్షకుల మాదిరి వ్యవహరిస్తున్నాయని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.