హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే పిచ్చి పట్టుకుందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆరోపించారు. అందులో భాగంగానే తెలంగాణలోని సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాధ సభల్లో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణికి 144 సంవత్సరాల చరిత్ర ఉందని, ఈ సంస్థను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నడుప చేతకాక ముంచిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలు, కార్మికుల కష్టంతో రూ.2184కోట్ల లాభాల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. దసరా, దీపావళి పండుగలకు రూ.వెయ్యికోట్ల బోనస్ పంపిణీ చేసినట్టు వివరించారు. సింగరేణిలో 45వేల మందికి ఇండ్ల స్థలాలకు పట్టాలు జారీ చేశామన్నారు.