మంత్రముగ్ధుల్ని చేసే కావలా గుహలు..

  • In Tourism
  • February 17, 2020
  • 260 Views
మంత్రముగ్ధుల్ని చేసే కావలా గుహలు..

కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమల్లో ఎన్నో ఆధ్యాత్మిక,పర్యాటక ప్రాంతాలతో దేశవిదేశాల పర్యాటకులను ఆకర్షిస్తున్న ఉత్తర కన్నడ జిల్లాలో ప్రకృతి పచ్చదనంతో పాటు ఆధ్యాత్మిక భావనలు వెదజల్లుతున్న కవల గుహలు పర్యాటకంగానే కాకుండా ఆధ్యాత్మిక ప్రాంతంగా కూడా ప్రసిద్ధి చెందింది.దండేలి పట్టణం నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనున్న దట్టమైన దండేలి అభయారణ్యం మధ్యలో ఉన్న కావల గుహలు, కావళేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించడానికి ప్రతిరోజూ పర్యాటకులు తరలివస్తుంటారు.భక్తులతో పాటు ప్రకృతి ప్రేమికులు,సాహస క్రీడల ప్రేమికులు సైతం కావల గుహలు సందర్శించి ప్రకృతి అందాల ఆరాధన, సాహసక్రీడల్లో మునిగి తేలుతుంటారు.

కావలా గుహలు..

కావలా గుహలు..

ఎన్నో యుగాల క్రితం అగ్నిపర్వతాల విస్పోటనం,భౌగోళిక సంఘర్షణల వల్ల దండేలి అడవుల్లో లోతైన ప్రాంతంలో ఈ కావల గుహలు ఏర్పడ్డాయని స్థానిక చరిత్ర.పూర్తిగా సున్నపురాతితో ఏర్పడడంతో ఈ గుహలను సున్నపురాయి గుహలు లేదా సిద్దా గుహలు అని కూడా పిలుస్తుంటారు.దండేలి అడవుల్లో ట్రెక్కింగ్‌ చేసిన అనంతరం సుమారు 1000 మెట్లు దిగుతూ కిందకు వెళితే కావల గుహల ప్రవేశద్వారానికి చేరుకోవచ్చు.అక్కడి నుంచి ఇరుకైన చీకటిగా ఉండే సున్నపురాయి,స్టాలగ్మైట్‌ నిర్మాణాలను జాగ్రత్తగా దాటుకుంటూ 40 అడుగుల కిందకు దిగితే కావలేశ్వర ఆలయం చేరుకోవచ్చు.ఈ ప్రయాణం ఆసాంతం పర్యాటకులు చేతుల్లో కాగడాల వెలుగుల్లో చేయాల్సి ఉంటుంది.శివరాత్రి సమయంలో మినహా అన్ని సమయాల్లో ఈ మార్గంలో చిమ్మచీకట్లు ఉండడంతో పర్యాటకులు కాగడాల వెలుగులో ప్రయాణించాల్సి ఉంటుంది.

స్టాలగ్మైట్ నిర్మాణం..

గుహలో సూర్యకిరణాల అందం..

కావలేశ్వర ఆలయం చేరుకున్నాక అందులో ఐదు అడుగుల ఎత్తు ఐదు అడుగుల వెడల్పుతో గింజలు,ఆకులు,సున్నపురాయితో సహజసిద్ధంగా ఏర్పడ్డ శివలింగం అత్యంత అద్భుతంగా కనిపిస్తూ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.శివలింగం పైభాగంలో ఉన్న ఆవు పొదుగు వంటి రాతి ఆకారం నుంచి అన్ని రుతువుల్లోనూ సన్నటినీటి ధార ప్రవహిస్తూ శివలింగానికి అభిషేకం చేస్తుంటుంది.కావలేశ్వర ఆలయాన్ని సందర్శించిన అనంతరం అక్కడి నుంచి బయటకు రావాలంటే మరో మార్గంలో ప్రయాణించాలి.అక్కడి నుంచి మరికొంత కిందకు ప్రయాణించి లోయలోని కాళి నది ఒడ్డును నడుస్తూ అక్కడి నుంచి బయటకు చేరుకోవాలి.ఈ ప్రయాణం సైతం ఆసాంతం అత్యంత అందంగా,అద్భుతంగా ఉంటుంది.కావలేశ్వర ఆలయం సందర్శించిన అనంతరం చాలా మంది భక్తులు,పర్యాటకులు సైతం ఈ ప్రాంతంలో కొద్దిసేపు ధ్యానం చేయడానికి ఆసక్తి కనబరుస్తారు.ప్రశాంత వాతావరణంలో కాళినది ప్రవాహం మధ్యలో బండరాళ్లపై ధ్యానం చేస్తే మానసిక ప్రశాంత లభిస్తుందని ప్రతీతి.

కావలేశ్వర ఆలయం..

శివలింగం..

 

ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కావలా అనే రాక్షసి బారి నుంచి ఈ ప్రాంతానికి విముక్తి కల్పించడానికి కవిలా అనే రుషి కావలా రాక్షసిని అంమొందించారని అందుకే ఈ ప్రాంతానికి కావలా అనే పేరు వచ్చిందని అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు కావల గుహల్లో చాలా కాలం బస చేశారని స్థానిక చరిత్ర.దశాబ్దాలుగా కాళినది ఒడ్డున ఉన్న ఉక్కలి గ్రామంలో ఉంటున్న దేశాయ్‌ కుటుంబానికి కావలా గుహలు సంరక్షణగా ఉంటున్నాయి.దేశాయ్‌ కుటుంబ సభ్యుల నేతృత్వంలోనే కావలేశ్వర ఆలయంలో శివలింగానికి పూజలు తదితర కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.ఇక శివరాత్రి సమయంలో అయితే కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుండడంతో కావలా గుహలు సహజత్వాన్ని కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.ఇక్కడికి వచ్చ భక్తులు ఈ మార్గాల్లో ప్లాస్టిక్‌ ఉత్పత్తులు తదితర వ్యర్థాలను పడేస్తుండడంతో గుహ పరిసరాల్లో,కాళి నది కలుషితమవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

కాళి నది..

కాళి నది..

అందుకే కావలా గుహల నిర్వహణ బాధ్యతలను సైతం అటవీశాఖ అధికారులు దేశాయ్‌ కుటుంబాలకే అప్పగించారు.ఇక కావలా గుహల చుట్టూ ఉన్న అనంత ప్రకృతి అందాలు మనసులను మరో ప్రపంచానికి తీసుకెళతాయి.దండేలి అడవుల్లో వన్యప్రాణుల అభయారణ్యం,పులుల సంరక్షణ కేంద్రం,ఎత్తైన శిఖరాలపై ట్రెక్కింగ్‌,కొండల అంచుల నుంచి వందల అడుగుల కిందకు దూకే జలపాతాలు వాటిలో స్నానాలు ఇలా చెప్పుకుంటూ పోతే దండేలి అడవుల ప్రత్యేకతల గురించి ఒక గ్రంథమే లిఖించవచ్చు. కావలా చుట్టూ అరుదైన జంతు,పక్షుల జాతులతో పాటు క్రూరమృగాలైన పెద్ద పులులు, చిరుతలు, పాంథర్స్‌, ఉడుతలు, ఏనుగులు,అడవినక్కలు ఇలా ఎన్నో వన్యప్రాణులు తారసపడతాయి..

దండేలిలో అందమైన జలపాతాలు..

దండేలిలో అందమైన జలపాతాలు..

చేరుకోవడం ఎలా..
బెంగళూరు నుంచి ప్రభుత్వ లేదా ప్రైవేటు వాహనాల్లో నేరుగా దండేలి పట్టణానికి చేరుకోవాలి.అక్కడి నుంచి ప్రభుత్వ వాహనాల్లో పనసోలి గ్రామానికి చేరుకొని అక్కడి నుంచి కూడా ప్రభుత్వ వాహనాల్లో కావలా గుహలకు చేరుకోవాలి.పనసోలి నుంచి కావల గుహలకు ప్రైవేటు వాహనాలపై నిషేధం విధించిన నేపథ్యంలో ప్రభుత్వ వాహనాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos