నయనమనోహరం కలసా పట్ణణం..

  • In Tourism
  • January 21, 2020
  • 261 Views
నయనమనోహరం కలసా పట్ణణం..

కర్ణాటక రాష్ట్ర పర్యాటకానికి రాజధానిగా విరాజిల్లుతున్న చిక్కమగళూరు జిల్లాలో మరో అద్భుత పర్యాటక ప్రాంతం కలసా.స్థలపురాణం ఆధారంగా కలసాను కర్ణాటక ఆలయ పట్టణంగా ప్రసిద్ధి చెందింది.భద్ర నది ఒడ్డున దట్టమైన పశ్చిమ కనుమల అడవులతో పలు ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు విహార ప్రదేశాలను కూడా కలిగిఉండి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.కళాశేశ్వర ఆలయంతో పాటు పలు పురాతన ఆలయాలతో కలసా పట్టణం ఆధ్యాత్మిక భావనలను కలిగిస్తుంది.దక్షిణ భారతదేశ రాజుల పాలనలో ఉన్న కలసాలో ఆలయాలపై శిల్పకళలు,ప్రతిమలు దక్షిణభారత దేశ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంటుంది.వేసవిలో కొద్ది పాటి ఉష్ణోగ్రతలు మినహా ఏడాదిపొడవునా కలసా విహారయాత్రకు అత్యంత అనుకూలంగా ఉంటుంది.

కలసా చుట్టు అందమైన దృశ్యాలు..

కలసా పేరు వెనుక పలు పురాణగాథలు దాగి ఉన్నాయి.కలస అంటే సంస్కృతంలో కల్ష(నీరు పట్టుకున్న కుండ) అని అర్థం.భద్ర నదీ తీరాన ఉండడంతో ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా నీరు పుష్కలంగా లభిస్తుండడంతో ఈ ప్రాంతానికి కలసాగా నామకరణం చేసినట్లు స్థలపురాణం.కలసాలో కనిపించే ప్రతి ఆలయం హిందూ నిర్మాణశైలి ప్రకారమే దర్శనమిస్తాయి.ప్రతి ఆలయానికి పైభాగంలో గుండ్రటి శిఖరం తప్పనిసరిగా ఉంటుంది.కలస పట్టణానికి మూడు వైపులా భద్ర నది దక్షిణాన దుగ్గప్పనకట్టె కొండ ఉంటుంది.ఆకాశం నుంచి చూస్తే కలసా పట్టణం నీటితో ఉన్న కుండలా కనిపించడంతో ఈ ప్రాంతానికి కలసాగా పేరు వచ్చిందని చెబుతారు.

భద్రా నది..

కలసా అడవుల్లో ఆహ్లాదం పంచే జలపాతం..

అన్ని రుతువుల్లోనూ నీటి సౌలభ్యం పుష్కలంగా ఉండడంతో కలసాలో కాఫీ,సుగంధ ద్రవ్యాలు,అస్కనట్‌ పంటలతో పాటు ఆయుర్వేద వనాలు కూడా విరివిగా సాగు చేస్తారు.ఈ సుగంధ ద్రవ్యాల తోటలు వెదజల్లే సుగంధ పరిమళాల మధ్యలో నడుచుకుంటూ కలసా చుట్టుపక్కనున్న అటవీప్రాంతంలో విహారం,జలపాతాల్లో స్నానాలు చేస్తుంటే తనువు,మనసు పులకరించడం తథ్యం.కలసా పట్టణం వెనుక మరో పురాణగాథ కూడా దాగి ఉంది.శివపార్వతులు వివాహ సమయంలో భూ భ్రమణంలో పెనుమార్పులు సంభవించడంతో భూ సమతౌల్యతను కాపాడడానికి దక్షిణ ప్రాంతానికి వెళ్లాలంటూ శివుడు అగస్త్యమునికి సూచించాడు.అందుకు అగస్త్యముని విముఖత వ్యక్తం చేయడంతో భూమిని రక్షించడం కోసం దక్షిణ ప్రాంతంలోని(ప్రస్తుత కలసా)లో స్వయంగా వెలుస్తానని అక్కడి నుంచే దివ్యదృష్టితో తన వివాహం తిలకించవచ్చంటూ శివుడు తెలపడంతో అగస్త్యముని కలసాకు రావడానికి అంగీకరించాడు.

కలసా చుట్టూ తేయాకు తోటలు..

కలసా చుట్టూ తేయాకు తోటలు..

అలా కలసాకు వచ్చిన అగస్త్యముని భూసమతౌల్యాన్ని కాపాడడడంతో పాటు అక్కడి నుంచే శివపార్వతులు వివాహం తిలకించినట్లు చరిత్ర.ఈ నేపథ్యంలో ప్రతిఏడాది కార్తీకశుద్ధ ఏకాదశి పర్వదినాన కలసాలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగం వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.కలసాలో ప్రముఖంగా చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుంటే..
పంచతీర్థాలు..
పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనున్న పంచ తీర్థాలు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం.వషిష్ట తీర్థం,నాగతీర్థం,కోటితీర్థం,రుద్రతీర్థం,అంబ తీర్థాలను పంచ తీర్థాలుగా పిలుస్తారు.ఈ పంచతీర్థాల్లో ఒక్కో తీర్థానికి ప్రత్యేకమైన పురాణగాథ ఉందని స్థానికులు చెబుతారు.

అంబ తీర్థం..

కళాశేశ్వర ఆలయం..
భద్ర నదీ తీరాన కొండపై ఉన్న కళాశేశ్వర ఆలయం తప్పకుండా చూడాల్సిన అద్భుత ప్రదేశం.హొయ్సళ రాజుల హాయంలో నిర్మించడంతో ఆలయం అణువణువు హొయ్సళ రాజుల శిల్పకళావైభవం ఉట్టిపడుతుంటుంది.ఆలయం లోపల సబ్బురాయితో చేసిన నిర్మాణం అబ్బురపరుస్తుంది.దూరం నుంచి చూస్తే ఆలయం గోపురం నీటి కుండలా కనిపిస్తుంటుంది.

కళాశేశ్వర ఆలయం..

గిరిజాంబ ఆలయం..
గిరిజాదేవికి అంకితం చేయబడ్డ ఈ ఆలయంలో ప్రతి ఏటా గిరిజాకళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.కన్నులపండుగగా సాగే శివుడు,గిరిజాదేవి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు.ప్రతి ఏటా దీపావళి పండుగ జరిగిన రెండు అనంతరం గిరిజాకళ్యాణం నిర్వహిస్తుంటారు.కాశీ నుంచి అగస్త్యమునితో పాటు వచ్చి ఇక్కడే స్థిరపడ్డ హస్కెరె,మావినకెరె,కునికెరె అనే మూడు వంశస్థులు గిరిజాకళ్యాణం జరిపించడం ఆవనాయితీగా వస్తోంది.
వెంకటరమణ ఆలయం..
కలసాలో జరిగే అతిపెద్ద పండుగల్లో వెంటకరమణ స్వామి ఆలయంలో నిర్వహించే రథోత్సవం లేదా కార్‌ ఫెస్టివల్‌ కూడా ముఖ్యమైనది.ఈ పండుగను ఆంగ్ల కాలెండర్‌ ప్రకారం కాకుండా హిందూ కాలెండర్‌ ప్రకారం తేదీలు నిర్ణయిస్తారు.ఈ పండుగ సందర్భంగా ఆలయంలోని ఉత్సవ విగ్రహాన్ని పట్టణం మొత్తం రథాలపై ఊరేగిస్తారు.ఈ రథోత్సవాలు తిలకించడానికి కూడా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.వీటితో పాటు హనుమాన్‌ ఆలయం,రంజల్‌ మహాలక్ష్మీ ఆలయం,వశిష్ట ఆలయం కూడా తప్పకుండా చూడాలి.ఇవి కాకుండా కలసాకు సమీపంలో ఉన్న గంగమూల,చార్మాడిఘాట్‌,ధర్మస్థళ,క్యాతనమక్కి హిల్స్‌,రాణి ఝరీ కోట తప్పకుండా చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు..
చేరుకోవడం ఎలా..
బెంగళూరు లేదా మంగళూరు నుంచి ప్రభుత్వ,ప్రైవేటు వాహనాల్లో నేరుగా కలసా పట్టణం చేరుకోవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos