ఈ నెలలో టూర్ ప్లాన్‌ చేస్తున్నారా…ఇటు ఓ లుక్కేయండి..

ఈ నెలలో టూర్ ప్లాన్‌ చేస్తున్నారా…ఇటు ఓ లుక్కేయండి..

హిమాలయాలను సందర్శించడానికి సాధారణంగా వేసవిని ఎంచుకుంటారు. ఎందుకంటే…మంచు కొండలు కనుక శీతా కాలంలో అటు వైపు వెళ్లలేమనే భావన కావచ్చు. అయితే శీతా కాలంలో అటుగా వెళితే, ప్రకృతి ప్రేమికులు పరవశించిపోవడం ఖాయం. ఇదే క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని స్పితి లోయకు వెళితే అదో మధురానుభూతే. అడ్వెంచర్‌ టూరిజం..అంటే…సాహస పర్యాటకాన్ని ఇష్టపడే వారు ఈ ట్రిప్పును మరిచిపోలేరు. ఈ ప్రయాణం ఉల్లాసభరితంగా కాకుండా ఉత్కంఠభరితంగా సాగుతుంది. గుండె దిటవు ఉన్న వారికి ఇదో మరచిపోలేని, మరుపరాని మజిలీ.

గుజరాత్‌ వెళ్లాలనుకునేవారికి జనవరి అనువైన నెల. ఈ నెల్లోనే అక్కడ ప్రఖ్యాతిగాంచిన రాణ్ ఉత్సవ్ జరుగుతుంది. గుజరాత్ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ఒక చోటుకు చేర్చే అద్భుతమైన ఉత్సవం ఇది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు గుజరాత్ నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కళాకారులు వస్తుంటారు. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు ఏడారుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన రాణ్ ఆఫ్ కచ్‌లో విలువైన సమయం గడపవచ్చు. జనవరిలో ఇక్కడ ఎండ తక్కువగా ఉంటుంది.

కేరళలోని కొచ్చి ప్రాంతంలో  ఇదివరకే కొచ్చి మూసీరియస్ బినాలే ప్రదర్శన ప్రారంభమైంది. ఇక్కడ అనేక కళలకు సంబంధించిన అరుదైన కలెక్షన్‌ను తిలకించవచ్చు. ఈ ఎగ్జిబిషన్ రెండు నెలల ఉంటుంది. జనవరిలో కేరళ సందర్శనకు అనువైన వాతావరణం ఉంటుంది. అందమైన బీచ్‌లలో సేదతీరడం, బ్యాక్ వాటర్స్‌లో హౌస్ బోట్ ప్రయాణం, మున్నార్ పచ్చని వాతావరణంలో విహారం పర్యాటకుల్లో ఉత్తేజాన్ని నింపుతాయి.

ఇక విదేశాల విషయానికొస్తే…జనవరిలో థాయ్‌లాండ్‌ పర్యటన ఎంతో వినోదభరితంగా ఉంటుంది. మీరు విలువైన సమయాన్ని గడపాలనుకుంటే కొన్ని ఆఫ్ బీట్ ట్రైల్స్ కూడా సిద్ధంగా ఉంటాయి. సింగపూర్ మాదిరిగానే థాయ్‌లాండ్‌లోని పట్టణ ప్రాంతాలన్నీ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక అలంకరించి ఉంటాయి.

జనవరి నెలలో శ్రీలంక పర్యటన ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది. సర్ఫింగ్, సన్ బాత్, రైలు ప్రయాణాలు, ఆధ్యాత్మిక విహారాలు, విలాసవంతమైన వసతి సౌకర్యాలు వంటి ఎన్నో పర్యాటక ఆకర్షణలతో శ్రీలంక ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. భారతదేశ దక్షిణ తీరప్రాంతానికి కేవలం 31 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ దేశం దక్షిణ ఆసియాలోని ఒక చిన్న ద్వీపం.

ఇండోనేషియాలోని బాలి గురించి కూడా చెప్పుకోవాలి. ఈ నెలలో ఇక్కడి వాతావరణం పర్యటనకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతే కాదు అద్భుతమైన బీచ్ పార్టీలు, షాపింగ్ వంటి ఎన్నో ఆకర్షణలు పర్యాటకుల కోసం ఎదురుచూస్తుంటాయి. కేవలం పార్టీలు మాత్రమే కాదు బాలిలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇదివరకెన్నడూ పొందని గొప్ప పర్యాటక అనుభవాల కోసం జనవరి నెలలో బాలి సందర్శనకు వెళ్లి తీరాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos