సంక్షోభంలో దాంపత్య జీవనం

సంక్షోభంలో దాంపత్య జీవనం

బెంగళూరు : పాశ్చాత్య పోకడలు, మారుతున్న నగర జీవన శైలి…ఇత్యాది అంశాలు భారతీయ జీవన విధానంలో పెడ ధోరణుల వైపు తీసుకెళుతున్నాయి. దాంపత్య జీవనంలో విపరీత పోకడలకు దారి తీస్తున్నాయి. క్రమేపీ మనం పాశ్చాత్య జీవన శైలిలోకి వెళ్లిపోతున్నామా…అని సంప్రదాయవాదులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అపురూప దాంపత్య జీవనం విషయంలో భారత దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. ఇప్పుడు కొన్ని సర్వే నివేదికలు దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.

బెంగళూరు నగరంలో వివాహేతర సంబంధాలు ఏయేటికాయేడు పెరుగుతూ వస్తున్నాయని ఓ నివేదిక తేల్చింది. గ్లీడెన్‌ అనే డేటింగ్‌ యాప్‌ ఈ  సర్వేను నిర్వహించింది. వివాహేతర సంబంధాలకు కూడా ఈ యాప్‌ వేదికగా మారింది. ఇప్పటికే లక్షా 35 వేల మంది ఈ సైట్‌లో చందాదారులుగా చేరారు. బెంగళూరు నుంచి 43,200 మంది మహిళలు కూడా చందాదారులే. పురుషులు 91,800 మంది ఉన్నారు. ఈ సైట్‌లో మొత్తం ఆరు లక్షల మంది చందాదారులున్నారు. ఈ సర్వేలో తేలిన మరో ఆసక్తికరమైన అంశమేమంటే…బెంగళూరు యూజర్లు సగటున రోజుకు గంటన్నర పాటు చాట్‌లో ఉంటారు.

సర్వేలో తేలిన మరో అంశమేమంటే…పురుషులు 24-30 ఏళ్ల ప్రాయంలోని యువతులను కోరుకుంటూ ఉంటే, మహిళలు 31-40 ఏళ్ల ప్రాయంలోని పురుషులను ఇష్టపడుతున్నారు. గ్లీడెన్‌ అంతర్జాతీయ సైట్‌. దాంపత్య జీవనంలో ఎందుకీ పెడధోరణులు అనే అంశంపై కూడా సర్వే చేసింది. భర్తలు గృహస్థ జీవితంలో సహకరించడం లేదని, ఆ కోపంతోనే తాము ఇలా పక్క చూపులు చూడాల్సి వస్తోందని పది శాతం మంది మహిళలు వెల్లడించారు. దాంపత్య జీవితం బోర్‌ కొట్టడంతోటే భర్తలను మోసగించాల్సి వస్తోందని 77 శాతం మంది మహిళలు వెల్లడించారు. అపరిచితులతో సాగించే చాట్‌ల వల్ల కలిగే ఉల్లాసం ద్వారా భర్తలపై మరింతగా మోహం పెరుగుతోందని ప్రతి పది మందిలో నలుగురు మహిళలు చెప్పినట్లు సర్వే నివేదిక తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది మహిళలు, 57 శాతం మంది పురుషులు తమ బిజినెస్‌ ట్రిప్పులలో ఇతరుల వ్యామోహంలో పడుతున్నట్లు సర్వే సందర్భంగా వెల్లడించారు. ఇదిలాఉంటే…ఆర్టికల్‌ 377ను రద్దు చేయడం ద్వారా స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించడంతో వివాహితుల్లో ఈ పోకడ 45 శాతం వరకు పెరిగిందని సర్వే తేల్చింది.

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం, అలాంటి సందర్భాల్లో విడివిడిగా ఉండాల్సి రావడం ఈ పోకడలకు నాంది పలికిందని సర్వే తెలిపింది.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos