వివాహాలు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు..

  • In Tourism
  • February 9, 2020
  • 280 Views
వివాహాలు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు..

కర్ణాటకలో పర్యాటకంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాల్లో ఉత్తరకన్నడ జిల్లా కూడా ప్రముఖమైనదే.శిరిసి,మురుడేశ్వర్‌,యానా తదితర ఎన్నో పర్యాటక,ఆధ్యాత్మిక ప్రాంతాలను కలిగి పర్యాటకంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉత్తరకన్నడ జిల్లాలో మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం ఇడగుంజి. జిల్లాలోని హొన్నావర్‌ తాలూకాలో ఉన్న ఇడగుంజి హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా విరాజిల్లుతోంది.పర్యాటకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి చెందిన ఇడగుంజిలో పద్మం ఆకారంలో మోడకలను పట్టుకున్నట్లు ఉండే గణేశుడి విగ్రహంతో ఉన్న వినాయకుడి ఆలయం కర్ణాటకలో ప్రముఖ ఆలయాల్లో ఒకటి.హొన్నావర్‌ తాలూకా కేంద్రం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇడగుంజి వెనుక పురాణగాథ ఉన్నట్లు తెలుస్తోంది.ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రవేశించే తరుణంలో శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించి భూలోకాన్ని వదిలివెళ్లడానికి నిర్ణయించుకోవడంతో కలియుగంపై ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు.

ఇడగుంజి ఆలయంలో పూజలు అందుకుంటున్న వినాయకుడు..

దీంతో కలియుగంలో ఎదురయ్యే సమస్యలు అధిగమించడానికి పరిష్కార మార్గాల కోసం రుషులు కృష్ణుడి సహాయం కోరుతూ శరావతి నదీ తీరాన దట్టమైన అటవీప్రాంతంలోని కుంజవానా అనే ప్రదేశంలో కఠోర తపస్సులు చేయడం ప్రారంభించారు.ఈ క్రమంలో నాదర మహర్షి సూచన మేరకు వలాఖిల్య అనే రుషి పుంగవుడు ఆ ప్రాంతంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి కలియుగ అడ్డంకులను తొలగించాలంటూ ప్రార్థించారు.రుషుల ప్రార్థన మేరకు వినాయకుడు కుంజావన వద్ద శరావతి నదీ తీరాన వెలిశాడని ప్రతీతి.అంతేకాదు త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు ఈ స్థలాన్ని సందర్శించి భూమిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న రాక్షసులను సంహరించినట్లు స్థలపురాణం.అనంతరం భవిష్యత్తుల్లో తలెత్తే విఘ్నాలను తొలగించడానికి గణేశుడు ఇక్కవే వెలియగా గణేశుడి కోసం దేవతలు చక్రతీర్థ,బ్రహ్మతీర్థ అనే రెండు పవిత్ర సరస్సులను సృష్టించగా నాదరుడు,రుషపుంగవులు దేవతీర్థ అనే చెరువును సృష్టించినట్లు స్థలపురాణం.

విష్ణుతీర్థ..

ఇక ఇక్కడి స్థానికులు తమ కుటుంబాల్లో వివాహాలకు సైతం ఇడగుంజి ఆలయంలో వినాయకుడి అనుమతులు పొందిన తరువాతే చేస్తుండడం గమనార్హం.వధూవరుడి కుటుంబాలు వినాయకుడి కాళ్ల పాదాల వద్ద చీటిలు ఉంచుతారు.కుడికాలు వద్ద ఉంచి చీటి కింద పడితే పెళ్లికి ఆమోదం తెలిసినట్లు భావిస్తారు.అదే ఎడమకాలు వద్ద చీటి కింద పడితే తిరస్కరించినట్లు భావిస్తారు.ప్రకృతి అందాలతో అలరారే పశ్చిమ కనుమల్లో ఉన్న ఇడగుంజి ఆలయం చుట్టూ ఎటు చూసినా ప్రకృతి సౌందర్యమే దర్శనమిస్తుంది.

కొడ్లుమనే విష్ణుమూర్తి ఆలయం..

ఇడగుంజి ఆలయం నుంచి అలా కొద్ది దూరం వెళితే మబ్బులను తాకే ఎత్తైన శిఖరాలు,దట్టమైన అడవుల్లో ట్రెక్కింగ్‌ చేయకుండా ఇడగుంజి పర్యటన సమాప్తం కాదు.దట్టమైన చెట్లతో కూడిన కొండలు,లోయలు దాటుకుంటూ మధ్యలో తారసపడే జలపాతాలు,నీటి ప్రవాహాలు,సెలయేళ్లలో ఈత కొట్టి పునరుత్తేజం పొందుతూ సాగే ట్రెక్కింగ్‌  మాటలకు అందని ఆహ్లాదం పంచుతుంది.ఇక ఇడగుంజి చుట్టుపక్కనున్న కొడ్లమనే విష్ణుమూర్తి ఆలయం,గోకర్ణ సముద్రతీరం,మురుడేశ్వర్‌ ఆలయం ఇలా మరెన్నో ఆధ్యాత్మిక,పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి..

ఇడగుంజి చుట్టూ అందమైన జలపాతాలు..

ఇడగుంజి చుట్టూ అందమైన జలపాతాలు..

ఎలా చేరుకోవాలి..
బెంగళూరు నుంచి ప్రభుత్వ లేదా ప్రైవేటు బస్సుల్లో నేరుగా మురుడేశ్వర్‌ చేరుకొని అక్కడినుంచి వాహనాల్లో ఇడగుంజి ఆలయం చేరుకోవచ్చు.రైలు మార్గంలో అయితే బెంగళూరు నుంచి మంగళూరు చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో ఇడగుంజి చేరుకోవచ్చు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos