అమరావతి : రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో ఉపరితల చక్రవాక ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, పశ్చిమ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణశాఖాధికారి ధర్మరాజు తెలిపారు. రుతుపవనాల ఆగమనంతో గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో వర్షాలు పడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండల ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్డి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నెల 14న అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైఎస్ఆర్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అంబేద్కర్ కోనసీమ, పల్నాడు, గుంటూరు, ఎన్టిఆర్ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.