డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 43 మున్సిపాల్టీలు, 46 నగర పంచాయితీలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఆ ఎన్నికల్లో ఓటేసేందుకు ఆ రాష్ట్ర మాజీ సీఎం హరీశ్ రావత్ డెహ్రాడూన్‌లో ఓ పోలింగ్ బూత్‌కు వెళ్లారు. కానీ ఓటర్ల జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. వాస్తవానికి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన డెహ్రాడూన్‌లోని నిరంజన్‌పుర్ ఏరియా నుంచి ఓటేశారు. అయితే ఈసారి మాత్రం ఆ ప్రదేశం నుంచి ఆయన ఓటు వేయలేకపోయారు. ఓటరు లిస్టు నుంచి ఆయన పేరు గల్లంతు అయినట్లు అధికారులు వెల్లడించారు.2009 నుంచి ఆ సీనియర్ కాంగ్రెస్ నేత నిరంజన్‌పుర్ నుంచే ఓటేస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి పేరు గల్లంతు అయిన అంశంపై హరీశ్ రావత్ స్పందించారు. ఇవాళ ఉదయం నుంచి ఓటు వేసేందుకు నిరీక్షిస్తున్నానని, కానీ పోలింగ్ స్టేషన్‌లో పేరు లేదని, లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడే ఓటేసినట్లు చెప్పారు. ఓటర్ల లిస్టును బీజేపీ తారుమారు చేసినట్లు ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే, కంప్యూటర్ సర్వర్లు మొరాయిస్తున్నట్లు ఈసీ చెప్పిందన్నారు.