న్యూఢిల్లీ : భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో సిజెఐగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సిజెఐ గవాయిని రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రివర్గంలోని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమానికి మాజీ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ గవాయికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.సిజెఐగా జస్టీస్ గవాయి ఆరునెలల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ ఏడాది నవంబర్‌లో ఆయన పదవీవిరమణ చేయనున్నారు. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన 1985లో బార్‌లో చేరారు. 2003లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.