గాజా : ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గాజా పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు సిద్ధమవుతుండగా.. గాజా పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో భీకర దాడులు చేయడంతో ఇప్పటివరకు కనీసం 200 మంది మఅతి చెందినట్లు సమాచారం. మరో 300 మంది వరకు గాయపడినట్లు గాజా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులకు ఆదేశించినట్లు తెలిపారు. ” మా బందీలను విడుదల చేయడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తోంది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే దాడులకు ఆదేశించాం. యుద్ధం లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు చేస్తోంది ” అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇజ్రాయెల్ ఇప్పటినుంచి హమాస్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
హమాస్ హెచ్చరికలు ….
తాజా పరిణామాలను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులతో ఇజ్రాయెల్ తమ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇటీవల ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా … దాదాపు 30మందికి పైగా తమ చెరలోని బందీలను మిలిటెంట్ సంస్థ విడుదల చేయగా.. ప్రతిగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈక్రమంలోనే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. అయితే, అవి అమలు దిశగా అడుగులు పడలేదు.