థాయ్ లాండ్ కంటే వైజాగ్ కే టికెట్ ఎక్కువ!

థాయ్ లాండ్ కంటే వైజాగ్ కే టికెట్ ఎక్కువ!

సంక్రాంతి రద్దీ ఆర్టీసీ బస్సులు, రైళ్లనే కాదు.. విమానాలను సైతం తాకింది. అన్ని ప్రధాన రైళ్లలో టికెట్‌ బుకింగ్‌లను నిలిపివేయడంతో అప్పటికప్పుడు బయలుదేరేందుకు ‘ఫ్లైట్‌ జర్నీ’ చేయాలనుకుంటున్న ప్రయాణికులకు పెరిగిన చార్జీలు చూడగానే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విశాఖకు వెళ్లేందుకు విమాన చార్జీ రూ.5వేల వరకు ఉంటుంది. కానీ ఈ నెల 12వ తేదీన ఆ ధర ఏకంగా రూ.18 వేల నుంచి రూ.47 వేలకు పెరిగింది. ఒక్కో ఎయిర్‌లైన్స్‌ చార్జీలు ఒక్కోవిధంగా ఉన్నాయి. అదేరోజు హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ చార్జీలు రూ.16,773 మాత్రమే ఉండడం గమనార్హం. న్యూఢిల్లీకి రూ.8,145 నుంచి రూ.9,191 వరకు ఫ్లైట్‌ చార్జీ ఉంది.

సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే నగరవాసుల రద్దీ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు తెలుసుకునేందుకు అనూహ్యంగా పెరిగిన విమాన చార్జీలే నిదర్శనం. 12వ తేదీన హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రూ.9,165 నుంచి రూ.15,024 వరకు ఉంది. అలాగే రాజమండ్రికి రూ.8,672 నుంచి రూ.14,867 వరకు చార్జీలు ఉన్నాయి. ఈ విమాన చార్జీలు గురువారం సాయంత్రం నమోదైనవి మాత్రమే. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, సింగపూర్, మలేసియా, బ్యాంకాక్‌ తదితర నగరాల కంటే విశాఖ, విజయవాడ, రాజమండ్రి వంటి నగరాల చార్జీలు అధికంగా ఉండడం గమనార్హం. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు ఈ చార్జీలు మరింత పెరిగే అవకాశముంది.

ఇటీవల వరకు ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ ట్రైన్‌ చార్జీలను తలపించిన వివిధ ఎయిర్‌లైన్స్‌ అమాంతంగా చార్జీలను పెంచేసి సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొంటున్నాయి. ఒకవైపు ప్రైవేట్‌ బస్సులు రెట్టింపు చార్జీలతో ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లోనూ చార్జీలను 50 శాతం పెంచారు. ‘సువిధ’ పేరుతో నడుపుతున్న రైళ్లు సైతం విమాన చార్జీల్లా పెరిగిపోతున్నాయి. మొత్తంగా నగరవాసులకు సంక్రాంతి సంబరాలు ప్రయాణాల్లోనే ఆవిరవుతున్నాయి. ఇంటిల్లిపాదీ కలిసి సొంత ఊరుకు వెళ్లి వచ్చేందుకు ఆయా రవాణా సదుపాయాల మేరకు రూ.వేలల్లో సమర్పించుకోవాల్సి వస్తోంది. ఇకనలుగురు కుటుంబ సభ్యులు కలిసి పొరపాటున విమానంలో వెళ్లాలని కోరుకుంటే రూ.లక్షలు ధారపోయల్సిందే. పండగ రద్దీ షురూ..
శుక్రవారం నుంచి పిల్లలకు సెలవులు ప్రకటించడంతో చాలా మంది గురువారమే సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో ఏపీ వైపునకు వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఏసీ, నాన్‌ఏసీ బోగీల్లో రిజర్వేషన్లు లభించనివారు జనరల్‌ బోగీల్లో వెళ్లారు. దీంతో ఒంటికాలిపై నిలుచుని ప్రయాణం చేయవలసి వచ్చింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. సికింద్రాబాద్‌ నుంచి సాధారణ రోజుల్లో సుమారు 1.80 లక్షల మంది తరలి వెళ్తుండగా గురువారం 2 లక్షల మందికి పైగా దాటిపోయారు. ఏపీతో పాటు, తెలంగాణ జిల్లాలకు వెళ్లే రైళ్లలోనూ ఇదే పరిస్థితి.

నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రోజుకు లక్ష మందికి పైగా బయలుదేరుతుండగా గురువారం మరో 10 వేల మందికి పైగా వెళ్లారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికుల రద్దీ మేరకు దక్షిణమధ్య రైల్వే ఈసారి వివిధ మార్గాల్లో సుమారు 150 సర్వీసులను అదనంగా ఏర్పాటు చేసింది. వీటిలో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా చార్జీలు పెరిగే 28 సువిధ రైళ్లు కూడా ఉన్నాయి. జనసాధారణ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. నగరం నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, చిత్తూరు, కడప, బెంగళూరు తదితర మార్గాల్లో వెళ్లే రైళ్లలో ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

బస్సుల్లోనూ పెరిగిన రద్దీ
మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల్లోనూ రద్దీ మొదలైంది. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు గురువారం నుంచి ఈ నెల 14 వరకు 5,252 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మొదటిరోజు గురువారం 500 బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన బస్‌స్టేషన్లతో పాటు కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్, లక్డీకాపూల్‌ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరిన ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు కిక్కిరిశాయి. ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలపై 50 శాతం అదనంగా విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రైవేట్‌ ఆపరేటర్లు ఒకటికి రెండు రెట్ల చార్జీలతో సంక్రాంతి దోపిడీకి తెరలేపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos