కంబళ గురించి ఈ విషయాలు తెలుసా!

కంబళ గురించి ఈ విషయాలు తెలుసా!

బురదనీటిలో దున్నపోతులతో పోటీగా వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పరుగెత్తి ప్రపంచ పరుగు పందెం విజేత ఉసెన్‌ బోల్ట్‌ రికార్డును బద్దలుకొట్టి మంగళూరుకు చెందిన శ్రీనివాసగౌడ అనే యువకుడు కొత్త చరిత్ర సృఫ్టించాడు.దీంతో శ్రీనివాసగౌడ పేరు అంతర్జాతీయస్థాయిలో మారుమోగింది. శ్రీనివాసగౌడకు అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇప్పించాలని సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ డిమాండ్లు చేశారు.దీనిపై కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సైతం స్పందించి శ్రీనివాసగౌడకు టెస్టులు నిర్వహించిన శిక్షణ ఇప్పిస్తామని ప్రకటించారు.ఇది జరిగిన రెండు మూడు రోజులకు కర్ణాటకలోని బజగోళి జోగిబెట్ట ప్రాంతానికి చెందిన నిశాంత్ శెట్టి అనే యువకుడు అదే కంబళ పోటీల్లో 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలోనే అధిగమించి శ్రీనివాసగౌడ రికార్డును సైతం అధిగమించి ఔరా అనిపించాడు. పోటీల్లో నిశాంత్ శెట్టి మొత్తం 143 మీటర్ల దూరాన్ని 13.68 సెకన్లలో పూర్తి చేసి మరో సరికొత్త రికార్డు సృష్టించాడు.అయితే ఎన్నో ఏళ్ల కఠోర సాధన చేసినా ఈ స్థాయిలో రికార్డు సృష్టించడానికి పరుగు పందేలా క్రీడాకారులు ఆపసోపాలు పడుతుంటే కంబళ పోటీల్లో ఇంత అవలీలలగా ఎలా సాధించేశారనే కుతూహలం ఇప్పుడు అందరిలోనూ మొదలైంది.దీంతో అసలు వీళ్లకు ఇంతటి శక్తిసామర్థ్యాలు ఎలా వచ్చాయి,అంతటి దేహదారుఢ్యం ఎలా వచ్చింది,అసలు కంబళ క్రీడ ఏంటనే ప్రశ్నల పరంపరలు,చర్చలు మొదలయ్యాయి.ఇక మొదటగా కంబళ క్రీడ గురించి తెలసుకుంటే..

కర్ణాటకలోని కరావళి ప్రాంతంగా పిలుచుకునే ఉత్తరకన్నడ,దక్షిణకన్నడ తదితర జిల్లాల్లో శతబ్దాలుగా నిర్వహిస్తున్న క్రీడ పేరు కంబళ.కరావళి ప్రాంత సంస్కృతి,సంప్రదాయానికి ప్రతీకగా కంబళ క్రీడను భావించే ప్రజలు దాన్ని కాపాడుకోవడానికి కంబళ పోటీలను ఘనంగా,ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు.నవంబర్‌ నెలలో మొదలయ్యే కంబళ సీజన్‌ మార్చ్‌ వరకు కొనసాగుతుంది.కంబళ సమితుల ఆధ్వర్యంలో కంబళ పోటీలు నిర్వహిస్తారు.100 మీటర్లు అంతకంటే ఎక్కువ దూరం ఉండే ట్రాక్‌లు సిద్ధం చేసి వాటిలో కొద్దిమేర బురదనీటిని నింపుతారు.అనంతరం వాటిలో దున్నపోతులను పరుగెత్తించే పోటీలు నిర్వహిస్తారు.వాటిని అదుపు చేస్తూనే వేగంగా పరుగెత్తించి వాటితో పాటు అంతే వేగంతో పరుగెత్తి ఎవరైతే ముందుగా లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతలుగా ప్రకటిస్తారు.ఇది కూడా ఒక తరహా పరుగు పందెం వంటిదే.అయితే సాధారణ ట్రాక్‌కు కంబళ ట్రాక్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది.సాధారణ ట్రాక్‌లో వేళ్లు,పూర్తి కాళ్లను నియంత్రించుకుంటూ పరుగెత్తాల్సి ఉంటుంది.కానీ కంబళలో మడమలను నియంత్రించుకుంటూ పరుగెత్తాల్సి ఉంటుంది.కంబళలో పోటీల్లో గెలిచిన విజేతలను కొన్నిసార్లు నగదు బహుమానంతో మరికొన్నిసార్లు బంగారు నాణేలను బహుమానంగా అందించి సత్కరిస్తారు.కంబళ పోటీల కోసం దున్నలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వాటి ఆరోగ్య సంరక్షణ,ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.ఇక కంబళ పోటీల్లో ఏడు రకాల పోటీలు ఉన్నాయి.బారే కంబళ,కోరి కంబళ,అరసు కంబళ,దెవెరే కంబళ,బాలె కంబళ,కెరె కంబళ,కాద్రి కంబళలుగా విభజించారు.అయితే కంబళ క్రీడలో అన్ని కంబళలు పోటీ కంబళలు కావు.అందులో కొన్ని కంబళలు పోటీ కంబళలు కాగా మరికొన్ని పోటీ లేని సాధారణ కంబళలు.అయితే రెండు రకాల కంబళలను బురదనీటిలో నిర్వహిస్తారు.అన్ని రకాల కంబళలు మూడు శతాబ్దాలకు పైగానే చరిత్ర కలిగిఉన్నాయి.వీటిలో ఎక్కువశాతం దక్షిణ కన్నడ జిల్లాలోనే నిర్వహిస్తుండగా కొన్ని కంబళలు సమీపంలోని ఉడుపి జిల్లాలో నిర్వహిస్తుంటారు..

కంబళ పోటీల్లో కొన్ని రకాల పోటీలను ప్రత్యేక విభాగాలు విభజిస్తారు.వాటిలో నెగిలు,హగ్గ,అడ్డా హాలేజ్‌,కేన్‌ హాలేజ్‌లు ప్రధానమైనవి.ఒక్కో రకమైన కంబళకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.వాటి గురించి పరిశీలిస్తే..

నెగిలు..
చెక్క లేదా ఇనుముతో తయారు చేసిన ఒకరకమైన భారీ నాగలితో నిర్వహించే పోటీని నెగిలుగా గుర్తిస్తారు.ఈ భారీ నాగలిని దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు.ఇందులో కేవలం ఎంట్రీ స్థాయి,జూనియర్‌,సీనియర్‌ రౌండ్లు మాత్రమే ఉంటాయి..
హగ్గ..
హగ్గ విభాగం పోటీల్లో పాల్గొనే దున్నలకు అనుభవం ఎక్కువగా ఉంటుంది.బలమైన తాడును దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు.ఇందులో ఓ వ్యక్తి చేతిలో తాడుతో దున్నలను నియంత్రిస్తూ వాటితో పాటు బురదనీటిలో పరుగెత్తుతాడు.ఇందులో కూడా సీనియర్‌,జూనియర్‌ రౌండ్లు ఉంటాయి..
అడ్డా హాలేజ్‌..
ఇది కాస్త కఠినంగానే ఉంటుంది.వంపు తిరిగిన చెక్కను దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు.ఈ సమయంలో చెక్కపలకపై వ్యక్తి నిలబడి ఉంటాడు.దీంతో పోటీలో పాల్గొనే దున్నలు చెక్కతో పాటు వ్యక్తిని సైతం బురదనీటిలో వేగంగా లాక్కెళతాయి.ఇందులో కేవలం సీనియర్‌ రౌండ్‌ మాత్రమే ఉంటుంది..
కేన్‌ హాలేజ్‌..
ఈ రకం పోటీలు ఎంతో రసవత్తరంగా,ఉత్కంఠగా ఉంటాయి.ప్రత్యేకంగా తయారు చేసిన గుండ్రటి చెక్కను దున్నలకు కడతారు.చెక్కకు మధ్యలో రెండు ప్రత్యేకమైన రంధ్రాలు ఏర్పాటు చేస్తారు.దున్నలు పరుగెత్తే సమయంలో ఈ రెండు రంధ్రాల నుంచి చిమ్మే నీటి ఎత్తు,వేగంతో విజేతను ఎన్నుకుంటారు.ఇందులో సూపర్‌ సీనియర్‌ రౌండ్‌ మాత్రమే ఉంటుంది..

కంబళ చరిత్ర గురించి తెలుసుకుంటే  పరమ శివుడికి భక్తులైన నాథుల ప్రేరణతో కంబళ మొదలైనట్లు చెబుతారు.కంబళ క్రీడలు ప్రారంభమయ్యే ముందురోజు రాత్రి కొరగ తెగకు చెందిన పురుషులు కొరగ సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శిస్తారు.అందులో భాగంగా పచంకర్మగా భావించే మద్య, మాంస, మత్స్య, ముద్ర,మిథున(రతి) పాటిస్తారు.దీంతోపాటు పానిక్కులుని అనే సాంస్కృతిక వేడుకను సైతం నిర్వహిస్తారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos