టెస్టులో ఇంగ్లండ్ రికార్డుల మోత

  • In Sports
  • June 15, 2022
  • 88 Views
టెస్టులో ఇంగ్లండ్ రికార్డుల మోత

న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన రెండో టెస్టులో ఆతిథేయ ఇంగ్లండ్ జట్టు రికార్డుల మోత మోగించింది. టెస్టుల్లో సాధ్యం కాదనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. మరో టెస్టు మిగిలి ఉండగానే 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 72 ఓవర్లలో టార్గెట్ 299 పరుగులు.. ఓవర్‌కు నాలుగు పరుగుల చొప్పున చేసినా ఈజీగా కొట్టేయొచ్చు. అయితే ఇది టెస్టు మ్యాచ్.. ప్రత్యర్థి జట్టులోనూ స్టార్ బౌలర్స్ ఉన్నారు. ఏ మాత్రం తేడా జరిగినా మొదటికే మోసం వస్తుంది. తొలి టెస్టు గెలవడంతో.. ఈ టెస్టును డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఇలాంటి సందర్బాల్లో ఏ జట్టైనా డ్రాకే మొగ్గుచూపుతుంది. కానీ ఇంగ్లండ్ మరోలా ఆలోచించింది. ఫాస్ట్‌గా ఆడితే గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి.
299 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 56 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో ఇక డ్రా ఖాయమనుకున్నారంతా. కానీ క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్ట్ స్టో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడుతాడని బహుశా అప్పుడు ఎవరు ఊహించి ఉండరు. చూస్తుండగానే ఫిఫ్టీ.. ఆపై సెంచరీ.. ఓవరాల్‌గా 92 బంతుల్లోనే 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 136 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. గాలికి అగ్ని తోడయినట్లు.. కెప్టెన్ స్టోక్స్ 70 బంతుల్లో 75 నాటౌట్.. రెచ్చిపోవడంతో ఇంగ్లండ్ సంచలన విజయం సాధించింది. 70 ఓవర్లు జరగాల్సిన మ్యాచ్ వీరిద్దరి విధ్వంసానికి 50 ఓవర్లలోనే ముగిసిపోయింది.
టెస్టు క్రికెట్లో చేజింగ్‌కు కొత్త అర్థం చెప్పిన జానీ బెయిర్ స్టో పనిలో పనిగా ఒక కొత్త రికార్డును తన పేరిట లిఖించకున్నాడు. ఒక టెస్టు మ్యాచులో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ అందుకున్న రెండో ఆటగాడిగా బెయిర్ స్టో నిలిచాడు. బెయిర్ స్టో సెంచరీకి 77 బంతులు తీసుకున్నాడు. ఇక 1902లో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ గిల్బర్ట్ జెస్సోప్ నాలుగో ఇన్నింగ్స్‌లో 76 బంతుల్లోనే సెంచరీ అందుకొని తొలి స్థానంలో నిలిచాడు.
►ఆటలో ఐదోరోజున ఆఖరి సెషన్‌లో 16 ఓవర్లలో 160 పరుగులు.. ఓవర్‌కు పది చొప్పున పరుగులు సాధించిన ఇంగ్లండ్ జట్టు మరొక కొత్త రికార్డును నమోదు చేసింది. ఒక టెస్టులో ఆఖరి సెషన్‌లో ఆడిన ఓవర్లలో.. ఓవర్‌కు 10 చొప్పున పరుగులు సాధించిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది.
►ఈ మ్యాచ్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 250 బౌండరీలు నమోదయ్యాయి. 24 సిక్సర్లు కూడా ఉన్నాయి. ఒక టెస్టు మ్యాచ్‌లో ఇన్ని బౌండరీలు నమోదు కావడం ఇదే తొలిసారి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos