హొసూరుకు గజ గమనం

హొసూరుకు గజ గమనం

హొసూరు : బెంగళూరు సమీపంలోని బన్నేరుఘట్ట అటవీ ప్రాంతం నుంచి హొసూరు అటవీ ప్రాంతానికి 12 ఏనుగులు ఒక్కసారిగా రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా బన్నేరుఘట్ట అటవీ ప్రాంతం నుంచి హొసూరు సమీపంలోని సానామావు అటవీ ప్రాంతానికి అక్టోబరు నెలలో వందల సంఖ్యలో ఏనుగులు రావడం, మూడు నెలల తరువాత తిరిగి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. హొసూరు ప్రాంతంలో రాగి, వరి, ఇతర వాణిజ్య పంటలను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. ప్రతి ఏటా అక్టోబర్ నెలలో రాగి పంట కంకి దశకు వచ్చే సమయంలో ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. పంటలను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు సౌర కంచెను అమర్చినా ఏనుగులు దానిని దాటుకుని పంటలను నాశనం చేస్తున్నాయి. వారం రోజుల కిందట కర్ణాటక నుంచి తళి అటవీ ప్రాంతాబికి వచ్చిన 40 ఏనుగుల మంద నుంచి 12 ఏనుగులు విడిపోయి హొసూరు సమీపంలోని సానామావు ఆటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో సానామావు, పోడూరు, పాత కోటారామాపురం చుట్టుపక్కల సుమారు 10 గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాలు కెలవరపల్లి డ్యాం ఆయకట్టు ప్రాంతం కావడంతో పంటలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం, రాగి, వరి కంకి దశలో ఉండడంతో పంటలను ఏనుగులు ఎప్పుడు ధ్వంసం చేస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జవులగిరి అటవీ ప్రాంతంలో ఉన్న మరో 30 ఏనుగులు సానామావు అటవీ ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం