లంచం తీసుకుంటూ దొరికిపోయిన విద్యాధికారి

లంచం తీసుకుంటూ దొరికిపోయిన విద్యాధికారి

హోసూరు : భావితరాలకు విద్యతోపాటు మంచి, మర్యాదలు  నేర్పి సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల వద్ద లంచం అడిగే అధికారుల వల్ల విద్యాశాఖకు కూడా అవినీతి జాఢ్యం సోకింది. హోసూరు ప్రాంతంలో పలు పాఠశాలల్లో పని చేసి అకాల మరణం చెందిన తెలుగు ఉపాధ్యాయుని కుటుంబీకుల వద్ద పెన్షన్ పైల్ మీద సంతకం చేసేందుకు ఓ విద్యాశాఖ అధికారి కేవలం రూ.5 వేల లంచానికి కక్కుర్తి పడి పోలీసులకు దొరికిపోయాడు. కృష్ణగిరి జిల్లా  కెలమంగలం యూనియన్ బైరమంగలం గ్రామానికి చెందిన రామయ్య పేద కుటుంబంలో పుట్టి బాగా చదువుకొని తెలుగు ఉపాధ్యాయుడుగా హోసూరు ప్రాంతంలోని పలు పాఠశాలల్లో పని చేశారు. రామయ్య వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ప్రయోజకులయ్యారు. మంచి ఉపాధ్యాయునిగా పేరు సంపాదించిన రామయ్య ఇటీవల అకాల మరణం చెందాడు. ఆయనకు రావాల్సిన గ్రాట్యుటీ, అతని భార్యకు రావలసిన పెన్షన్ కోసం  రామయ్య కుటుంబీకులు డెంకనికోట విద్యాశాఖ కార్యాలయంలో విన్నపాన్ని అందజేశారు. ఆయన సర్వీసు  ఫైల్‌ను పరిశీలించిన విద్యాశాఖ అధికారులు అతనికి  రావలసిన డబ్బును వెంటనే అందించేందుకు చర్యలు చేపట్టారు. మొదట వేగంగా కదిలిన పైల్ తరువాత విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న బాలాజీ అనే అధికారి వల్ల జాప్యం జరిగింది. తనకు రూ.5 వేల లంచం ఇస్తే తప్ప ఫైల్ కదిలేది లేదని బాలాజీ డిమాండ్ చేయడంతో చేసేదిలేక రామయ్య కొడుకు కిషోర్ కృష్ణగిరి అవినీతి నిరోధక శాఖ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కిశోర్‌కు రసాయనం తడిపిన కరెన్సీ ఇచ్చి విద్యాశాఖ అధికారి బాలాజికి ఇవ్వాల్సిందిగా సూచించారు. వారి సూచన మేరకు కిషోర్ బాలాజికి రూ.5 వేలను అందజేస్తుండగా అవినీతి నిరోధక శాఖ పోలీసులు బాలాజీని పట్టుకొని అరెస్టు చేశారు. అకాల మరణం చెందిన ఓ ఉపాధ్యాయుని కుటుంబానికి ప్రభుత్వం ద్వారా రావలసిన డబ్బును పొందడానికి విద్యాశాఖ  అధికారి లంచం తీసుకొని పోలీసులకు దొరికిపోవడం ఆ శాఖకు చెడ్డ పేరు తెచ్చిపెట్టింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos