అనర్హులకు భాజపా టికెట్లు

అనర్హులకు భాజపా టికెట్లు

బెంగళూరు : కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేల్లో 13 మందిని భాజపా ఉప ఎన్నికల బరిలో నిలిపింది. మొత్తం 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అనర్హత వేటు పడిన 17 మంది కాంగ్రెస్- జేడీఎస్ మాజీ ఎమ్మెల్యేల్లో 16 మంది ముఖ్యమంత్రి యడియూరప్ప సమక్షంలో గురువారం పార్టీలో చేరారు. కొద్దిసేపటికే భాజపా 13 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్‌ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ నిర్ణయంపై వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అనర్హత వేటును సమర్థిస్తూనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగా ప్రకటించడంతో వారికి ఊరట లభించింది. దీంతో 16 మంది అనర్హత ఎమ్మెల్యేలు గురువారం ఉదయమే భాజపాలో చేరారు. పార్టీ అభ్యర్థిత్వాలు ఖరారైన 13 మంది గతంలో పోటీ చేసిన స్థానాల్లోనే మళ్లీ బరిలోకి దిగబోతున్నారు. వీరి రాజీనామాతో మొత్తం 17 స్థానాలు ఖాళీ కాగా, ఎన్నికల వివాద వ్యాజ్యాలు కోర్టులో ఉన్నందున రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగడం లేదు. 15 స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికల్లో కనీసం ఆరింటిని గెలుచుకుంటేనే భాజపాకు అధికారంలో కొనసాగే వీలుంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos