న్యూ ఢిల్లీ:ఈసారి దిల్లీ అసెంబ్లీ పోల్స్‌లో ఎన్నికైన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దిల్లీ ఎమ్మెల్యేలలో నేరచరితుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం సానుకూల పరిణామం. 2020లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అయిన వారిలో అత్యధికంగా 43 మంది నేరచరితులే ఉండటం గమనార్హం. ఈ మేరకు వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ నివేదికను విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 699 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను ఏడీఆర్ రూపొందించింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్న వారిలో తీవ్ర నేరాలకు పాల్పడినవారు కూడా ఉండటాన్ని ఆందోళనకర అంశంగా ఏడీఆర్ పేర్కొంది. దిల్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 17 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయని తెలిపింది. వీరిలో పలువురిపై హత్యాయత్నం, మహిళలపై నేరాలతో ముడిపడిన అభియోగాలు నమోదైనట్లు వెల్లడించింది. ఈసారి ఎన్నికైన ఒక ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసులు, మరో ఇద్దరిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలోని సమాచారంతో వెల్లడైంది.