పాట్నా: అల్లరి మూకలు రెచ్చిపోయాయి. దళితుల ఇళ్లలోకి చొరబడి వారిని కొట్టారు. 20కు పైగా దళితుల ఇళ్లకు నిప్పుపెట్టారు. అగంతకులు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు బాధిత దళిత కుటుంబాలు ఆరోపించాయి. ఈ సంఘటనపై పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడితో సహా 15 మందిని అరెస్టు చేశారు. బీహార్లోని నవాడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దళితులు నివసిస్తున్న భూమిపై వివాదం ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు ఆ ప్రాంతానికి వెళ్లారు. దళితుల ఇళ్లలోకి చొరబడ్డారు. దళిత కుటుంబాలపై దాడులు చేశారు. వారి ఇళ్లకు నిప్పుపెట్టారు. ఆ వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి.