కర్నూలు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామంలో పీర్ల పండగ సందర్భంగా దళితుల సావుసోను ఆడారని ఆధిపత్య అగ్రకులాలు, బీసీ కులాలకు చెందిన వారు దాడి చేయడం దారుణమని ఈ దుర్మార్గమైన దారుణమైన కులదురంహకార దాడులను కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్ ) రాష్ట్ర అద్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప , అండ్ర మాల్యాద్రి ఖండించారు. ప్రపంచ దేశాలతో పాటుగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కులవ్యవస్థ అలానే కొనసాగడం మనువాద మతోన్మాద చర్య అన్నారు . మన దేశంలో అధికార ప్రధాన ప్రతిపక్ష నాయకులు, అధికారులు కులవ్యవస్థ పోయిందని చెప్పడం తప్ప కింది స్థాయిలో పూర్తిగా నిర్మించడంలో విఫలమయ్యారు అని వారు విమర్శించారు. దానికి నిదర్శనం అన్ని కులాలు కలిసి జరుపుకునే పీర్ల పండుగలో దళిత కులానికి చెందిన వారిని తీవ్రంగా కొట్టడం దుర్భాషలాడడం చూస్తుంటే మనం ఇలాంటి దుర్మార్గమైన దారుణమైన కులదురంకార సమాజంలో ఉన్నామో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఈ ఘటనకు పాల్పడిన వారిని తక్షణం అరెస్టు చేయాలని దళితులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు