విద్యార్థి ఖాతాలో రూ.900 కోట్లు జమ

విద్యార్థి ఖాతాలో రూ.900 కోట్లు జమ

పాట్నా: బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ఇటీవల ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలో పొరపాటున రూ.5.5 లక్షలు డిపాజిట్ అయిన విషయం తెలిసిందే. అయితే అవి తనకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని, వాటిని తిరిగి ఇవ్వనని అతను తెగించి చెప్పాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే అదే బిహార్‌లో మరొకటి వెలుగులోకి వచ్చింది. కానీ ఈసారి డబ్బులు లక్షల్లో కాదు ఏకంగా వందల కోట్ల రూపాయలు అకౌంట్‌లో జమయ్యాయి. అది కూడా పాఠశాలకు వెళ్లే పిల్లల అకౌంట్లలో. 10, 100 రూపాయలకే ఆనందపడే చిన్న పిల్లలు ఒకేసారి వారి అకౌంట్లలో రూ. 900 కోట్ల రూపాయలు జమ అయితే ఎలా ఉంటుంది. వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే..
కటిహార్ జిల్లాలోని బౌరా పంచాయితీ పరిధిలోని పస్తియా గ్రామానికి చెందిన ఆశిష్, విశ్వాస్ అనే ఇద్దరు విద్యార్థులకు బిహార్ గ్రామీణ్ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. వీరి పాఠశాల యూనిఫామ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు తమ ఖాతాలో జమ అయ్యిందో, లేదో అని తెలుసుకునేందుకు తమ తల్లిదండ్రులతో కలిసి ఊరిలోని ఇంటర్నెట్ వద్దకు వెళ్లారు.. బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వత వారి ఖాతాల్లో భారీగా నగదు ఉన్నట్లు తెలుసుకుని షాక్‌కు గురయ్యారు.
ఆరో తరగతి చదివే ఆశిష్ ఖాతాలో రూ. 6.2 కోట్లు.. గురు చరణ్ విశ్వాస్ ఖాతాలో రూ.900 కోట్లు జమయ్యాయి. ఈ విషయాన్ని గ్రామ అధికారి ధృవీకరించగా. ఈ సంఘటనపై బ్యాంక్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. డబ్బుల విషయం తెలిసి బ్యాంక్ మేనేజర్ మనోజ్ గుప్తా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇద్దరు అబ్బాయిల బ్యాంక్ అకౌంట్లలో భారీ మొత్తాన్ని గుర్తించినట్లు తమకు సమాచారం అందిందని, దానిని తాము పరిశీలిస్తున్నామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos