అనుకున్నదొక్కటి…అయినది ఒక్కటి…పాపం కేటీఆర్

అనుకున్నదొక్కటి…అయినది ఒక్కటి…పాపం కేటీఆర్

హోసూరు : హోసూరు సమీపంలోని సూలగిరి వద్ద  ప్రైవేట్ కళ్యాణ మంటపం  ఎదుట ఏర్పాటు చేసిన కనకదాసుని విగ్రహావిష్కరణ కార్యక్రమం హోసూరు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. డిఎంకె పార్టీ హోసూరు మహానగర ఉప కారదర్శి కేటీఆర్ అనే తిమ్మరాజుకు హోసూరు  సూలగిరి వద్ద కళ్యాణ మంటపం ఉంది. ఈ కళ్యాణ మంటపం ముందు కనకదాసుని ప్రతిమను ఏర్పాటు చేశారు. కురబ సామాజిక వర్గానికి ఆరాధ్య దైవమైన కనకదాసుని విగ్రహావిష్కరణ  కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కురబ సామాజిక వర్గం నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఉదయం 11 గంటల నుంచి ఆయన కోసం వేచి చూసిన ప్రజలు సాయంత్రం కావడంతో మెల్లగా జారుకున్నారు. ఇది గమనించిన సిద్ధరామయ్య జనం లేని సభలో ఎందుకు మాట్లాడాలని అగ్గి మీద గుగ్గిలమయ్యారు.ఇలాంటి కార్యక్రమాలకు. ఇకపై పిలవొద్దని ఆయన అక్కడున్న కురబ సామాజిక వర్గ నాయకులకు చురకలంటించారు. తరువాత మాట్లాడిన ఆయన  కనకదాసుకు కులం, మతం లేదని ఆయన సమానత్వాన్ని కోరుకున్నారని అన్నారు.

మరో వైపు కేటీఆర్ డిఎంకె పార్టీలో నాయకుడిగా చలామణి అవుతూ కులం పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం సబబు కాదని ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు మండిపడ్డారు. డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్…కులమతాలకు అతీతంగా ఉన్న ఏకైక పార్టీ  డిఎంకె ఒక్కటేనని ఉపన్యాసాలు దంచేస్తుంటే,  హోసూరు ప్రాంతంలో సొంత పార్టీకి చెందిన నాయకుడే కులం పేరుతో సమావేశాలు నిర్వహించడం సమంజసమా అని ఏడిఎంకె పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వేపనపల్లి నియోజక వర్గంలో తన బలాన్ని నిరూపించుకోవడానికి కేటీఆర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని డీఎంకే పార్టీకి చెందిన కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.

వేపనపల్లి నియోజకవర్గంలో వాల్మీకి, వన్నియర్లు,  కాపు, కురబ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నప్పటికీ, రాజకీయాలను శాసించేది మాత్రం కాపు, వన్నియర్లు,వాల్మీకి వర్గాలకు చెందినవారేననేది బహిరంగ రహస్యం. అక్కడ పోటీ చేసే ప్రతి నాయకుడు అన్ని సామాజిక వర్గాలతో తత్సంబంధాలు కొనసాగిస్తేనే గెలుపు సాధ్యం. ఇది నాయకుని లక్షణం కూడా. కానీ కేటీఆర్ ఏ ప్రాతిపదికన లెక్కలు వేసుకున్నాడో, దేనికోసం విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశాడోనని డిఎంకె పార్టీనాయకులే కాకుండా ఇతర పార్టీలకు చెందిన నాయకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ కేటీఆర్ వేపనపల్లి నియోజక వర్గంలో ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉంటే పప్పులో కాలేసినట్టే నని సొంత పార్టీ నాయకుల మదింపు. ప్రస్తుత ఎమ్మెల్యే మురుగన్, సీనియర్ నాయకుడు వీరారెడ్డి తదితర బడా నాయకులు ఎందరో నియోజకవర్గంలో ఉండగా కేటీఆర్‌కు టికెట్ లభించ ప్రసక్తే లేదని, ఆయన అశలు అడియాసలేనని పలువురు పేర్కొంటున్నారు.

సొంత నియోజకవర్గానికి కేటీఆర్ చేసిందేమిటని సొంత పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. వేపనపల్లి నియోజకవర్గంలో కురబ సామాజికవర్గం బలంగా కనిపించినా, రాజకీయాలను శాసించే స్థాయిలో లేదని ఇతర పార్టీల  నాయకుల విశ్లేషణ. డీఎంకేలో ఉంటూ పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి ఒక సామాజిక వర్గం కార్యక్రమాలను కేటీఆర్ ఏర్పాటు చేయడం పార్టీకి మంచిది కాదని పలువురి వాదన. ఏదేమైనా కేటీఆర్ కనకదాసుని విగ్రహావిష్కరణ కార్యక్రమానని సదుద్దేశంతో ఏర్పాటు చేసినా, సొంత పార్టీ నాయకులే విమర్శలు గుప్పించడం హోసూరు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలనేది నానుడి. ప్రత్యర్థి పార్టీల మాట అటుంచితే సొంత పార్టీలోనే విమర్శలపాలవడమే కాకుండా సిద్ధరామయ్య చేత కూడా అక్షింతలు వేయించుకున్న కేటీఆర్‌ పట్ల సానుభూతి చూపేవారు కూడా కరువయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos