బంగాల్​లో అనుమానాస్పద రేడియో సిగ్నల్స్

బంగాల్​లో అనుమానాస్పద రేడియో సిగ్నల్స్

కోల్‌కతా:దేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతున్నట్లు బంగాల్​లోని అమెచ్యూర్‌ హామ్‌ రేడియో సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. గత రెండు నెలలుగా బంగ్లాదేశ్‌ యాసతో ఉర్దూ, బెంగాలీ, అరబిక్‌ కోడ్‌ భాషల్లో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లను తమ ఆపరేటర్లు గుర్తించినట్లు పేర్కొంది. కాగా సరిహద్దులున్న బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు నెలకొనడం, పాక్‌తో ఆ దేశ అధికారులు సన్నిహితంగా ఉండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆందోళనకర అంశమని అధికారులు అంటున్నారు. మళ్లీ ఇటువంటి వస్తే తమకు తెలియజేయాల్సిందిగా రేడియో ఆపరేటర్లకు సూచించారు. గతేడాది డిసెంబర్‌లో హామ్ రేడియో ఆపరేటర్లు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్‌హట్, బొంగావ్ నుంచి ఉర్దూ, అరబిక్‌కు వాడి వివిధ కోడ్‌లలో మాట్లాడు కుంటున్నట్లు హామ్​ రేడియో సంస్థ గుర్తించిందని అధికారులు తెలిపారు. దక్షిణ 24 పరగణాలులోని సుందర్‌బన్స్ ప్రాంతాల నుంచి ఆ కోడ్​ బాషలు వినిపించినట్లు పేర్కొన్నారు. మరికొన్ని సార్లు ఇతర భాషల్లోనూ సిగ్నల్స్‌ వచ్చాయని అన్నారు. అయితే, తాము తొలుత వీటిని పట్టించుకోలేదని తెలిపారు. జనవరిలో జరిగిన గంగాసాగర్ మేళా సమయంలో వినియోగదారులు తమకు అనుమానాస్పద సంకేతాలు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేయడం వల్ల వెంటనే అప్రమత్తమై కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కోడ్‌ భాషను డీకోడ్‌ చేయడానికి కోల్‌కతాలోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ స్టేషన్ (రేడియో)కి సమాచారం పంపినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారి తెలిపారు. ‘స్మగ్లర్లు, తీవ్రవాద గ్రూపులు చర్చల కోసం ఇటువంటి సంకేతాలను వినియోగించుకుంటారు. వీటిని ట్రాక్‌ చేయడం కష్టమయినప్పటికీ డీకోడ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. 2002-2003లో కూడా ఇదే విధంగా అనుమానాస్పద సంకేతాలు వచ్చాయి. వాటిని ట్రాక్‌ చేసి, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గంగాసాగర్ ప్రాంతం నుంచి అక్రమ రేడియో స్టేషన్లను నిర్వహిస్తున్న ఆరుగురు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నాం. 2017లో బసిర్‌హట్‌లో మత ఘర్షణలు జరగడానికి ముందు హామ్ రేడియో వినియోగదారులు తమకు అనుమానాస్పద సంకేతాలను వినిపిస్తున్నాయని తెలిపారు. హామ్ రేడియో దేశ భద్రత విషయంలో అనేకసార్లు కీలక పాత్ర పోషించింది’ అని బీఎస్​ఎఫ్ అధికారి అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos