ఆదివాసీల హక్కులపై ముప్పేట దాడి

ఆదివాసీల హక్కులపై ముప్పేట దాడి

న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వినాశకర విధానాలతో ఆదివాసీల హక్కులపై ముప్పేట దాడి జరుగుతోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ, రిజర్వేషన్ల కుదింపు, మినహాయింపు చర్యల వల్ల ఆదివాసీలు, ఇతర అణగారిన తరగతులకు చెందిన ప్రజలు ఉద్యోగాలకు, ఉపాధి అవకాశాలకు దూరమవుతున్నారని చెప్పారు. ఆదివారం స్థానిక హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌లో ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ (ఎఎఆర్‌ఎం), సెంటర్‌ ఫర్‌ ఆదివాసీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె ప్రసంగించారు. మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచి ఆదివాసీ హక్కులు, ఉద్యోగాలపై దాడికి పూనుకుందని విమర్శించారు. అలాగే ఆదివాసుల భూములను అక్రమంగా గుంజుకొని కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తోందన్నారు. దీంతో అటవీ సంపదపైనా కార్పొరేట్‌ కంపెనీలు పెత్తనం సాగిస్తున్నాయని చెప్పారు. వీటిపై ఎఎఆర్‌ఎం పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కేంద్రంలోని బిజెపి విధానాల వల్ల ఆదివాసీ యువతీ, యువకులు ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాల ప్రయివేటీకరణ, వివిధ మినహాయింపులతో ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ఆదివాసీలను దూరం చేస్తున్న తీరుపై సదస్సులో డేటాను ప్రదర్శించారు. ఈ డేటాను ప్రస్తావిస్తూ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల హక్కును కూడా మోడీ సర్కార్‌ నీరుగారుస్తోందని తెలిపారు. మంచ్‌ చైర్‌పర్సన్‌ జితేంద్ర చౌదరి, మంచ్‌ జాతీయ కన్వీనర్‌ పులిన్‌ బాస్కే మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం మరింత ఉధృతంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. భూమి నుండి, అడవి నుండి, సంపద నుండి, ఇప్పుడు ఉద్యోగాల నుండి కూడా ఆదివాసీలను తరిమివేసే కుట్రలు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ జనాభా (2011 జనాభా లెక్కల ప్రకారం)లో 8.6 శాతం ఆదివాసులు ఉంటే, 7.5 శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నారని అన్నారు. ఎందుకు అలా? 8.6 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు.ప్రొఫెసర్‌ వికాస్‌ రావల్‌ సమర్పించిన ముసాయిదా నివేదికలో ఎస్‌టి జనాభాను తక్కువగా అంచనా వేశారని, అందువల్ల సి, డి కేటగిరిల్లో ఎక్కువ ఉద్యోగాలు ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టీకరణ చేశారని తెలిపారు. అందులో కూడా ఎస్‌టిలకు తప్పని సరిగా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2014 మోడీ అధికారంలోకి వచ్చేనాటికి మొత్తం కేంద్ర ప్రభుత్వ పోస్టుల సంఖ్య 32 లక్షలకు పైగా ఉన్నాయని, 2023లో దాదాపు 30 లక్షలకు తగ్గాయని తెలిపారు. 2014లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో దాదాపు 4.2 లక్షల ఖాళీలు ఉన్నాయని, అయితే ఇప్పుడు ఖాళీల సంఖ్య 5 లక్షలు పెరిగాయని తెలిపారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos