తిరుపతి : ప్రపంచాన్ని కుదిపేస్తోన్న సోలార్ విద్యుత్ కుంభకోణంపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ పెదవి విప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అదానీ కుంభకోణంలో మోడీ, జగన్, చంద్రబాబులకు వాటా ఉందని విమర్శించారు. డిసెంబర్ ఒకటి నుంచి ప్రజలపై ట్రూఅప్ ఛార్జీల మోతకు సిద్ధమవుతున్న టిడిపి కూటమి సర్కార్ దీనిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడులో ఆదివారం తిరుపతి జిల్లా 14వ మహాసభ ఉత్సాహంగా, ఉద్యమ స్ఫూర్తితో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ డబ్బు, కులం, కుటుంబ పాలనలాంటి అంశాలు ఈ రోజుల్లో అధికారాన్ని, నాయకులను తయారు చేస్తున్నాయన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకుంటున్నారని, భవిష్యత్తు కమ్యూనిస్టులదేనని తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్గ్ట్ర ప్రభుత్వ పెద్దకు సోలార్ విద్యుత్ కుంభకోణంలో రూ.1,750 కోట్లు ముట్టాయని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోన్నా మోడీ, చంద్రబాబు ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. తాను మోడీ చెప్పినట్లు చేశానని జగన్… మోడీ చెప్పకుండా తానేమీ చేయలేనని చంద్రబాబు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ అదానీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. సోలార్ విద్యుదుత్పత్తి కోసం రైతుల నుంచి తీసుకున్న భూములకు ఎకరాకు రూ.30 వేలు మాత్రమే చెల్లించేలా అదానీ ఒప్పందాలు చేసుకున్నారని, విద్యుదుత్పత్తి ద్వారా నెలకు రూ.5 లక్షల ఆదాయం అదానీకి వస్తుందని వివరించారు. మోడీ పాలనలో ఉద్యోగులు, కార్మికుల వేతనాలు 8 నుంచి 3 శాతానికి పడిపోయాయని, నిత్యావసర ధరలు మాత్రం 8 నుంచి 16 శాతం పెరిగాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల భజన చేస్తుండడం వల్లే దేశానికి ఈ దుస్థితి పట్టిందన్నారు.స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చిన టిడిపి నాయకులకు అధికారంలోకి వచ్చాక చేవ సచ్చిందా అని ప్రశ్నించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మాటకు విలువలేదని పార్లమెంట్ సాక్షిగా బిజెపి తూలనాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనంటూ తెగేసి చెప్పినా టిడిపి కూటమి సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మెగా డిఎస్‌సిపై చంద్రబాబు చేసిన తొలి సంతకం చెరిగిపోయిందంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాలపై ప్రజలు పశ్నించాలని, కమ్యూనిస్టులతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. చెగువేరా, భగత్ సింగ్ వారసుడినంటూ చెప్పుకున్న డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్… తిరుపతి లడ్డూ వివాదాన్ని సాకుగా చూపి సరికొత్త సనాతన బాబాగా మారారని, ఆయన సమతా వాదో? ఆర్‌ఎస్‌ఎస్ వాదో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ప్రజలు చూస్తున్నారని, భవిష్యత్తు వామపక్షాలదేనని పేర్కొన్నారు. ఉమ్మడి పోరాటాల ద్వారా బలమైన రాజకీయ శక్తిగా సిపిఎం రూపుదిద్దేందుకు కర్తవ్య దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. దీనికి ముందు సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.జనార్థన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మూలం రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కరయ్య మాట్లాడారు.