విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని, ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర స్టీల్ మంత్రిని జివిఎంసిలోని అఖిలపక్ష పార్టీల కార్పొరేటర్లు కలవటం కొరకు అవసరమగు తీర్మానం కొరకు కౌన్సిల్ ఏజెండాగా పెట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం కార్పొరేటర్లు గురువారం జివిఎంసి ప్రధాన కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సిపిఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి. గంగారావు, సిపిఐ ఫ్లోర్ లీడర్ ఎజె స్టాలిన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ తీవ్ర సంక్షోభ స్థితికి నెట్టబడిందని, రేపో మాపో మూసివేత దిశగా సాగుతుందన్నారు. మూడింటిలో రెండుబ్లాస్ట్ పర్నేస్ లు మూసివేశారన్నారు. అనేక డిపార్టుమెంట్లు నిలిచిపోయాయన్నారు. రోజుకి 21 వేల టన్నులు స్టీల్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా నేడు 4 వేల టన్నులకి కుట్రతో దిగజార్చారన్నారు. ఈనేపధ్యంలో ఈ నెల 24న మహా విశాఖ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరగబోతుందని, ఈ కౌన్సిల్ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని, తక్షణం రూ.5 వేల కోట్లు వర్కింగ్ కేపిటల్ మంజూరు చేయాలని, అప్పులపై 5 ఐదేళ్లు మారిటోరియం విధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని, కేంద్ర స్టీల్ మంత్రి హెచ్ డి కుమారస్వామిలను కోరారు. జివిఎంసిలోని అఖిలపక్ష పార్టీల కార్పొరేటర్లు కలిసి చర్చించడం కోసం అవసరమగు తీర్మానం కొరకు కౌన్సిల్లో ఏజెండాగా పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తము మేయర్ ను దీనిని కౌన్సిల్లో ఏజెండాగా పెట్టాలని రాతపూర్వకంగా ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. అలాగే తెలుగుదేశం, వైసిపి, జనసేన పార్టీల ఫ్లోర్ లీడర్లకు కూడా తమ యొక్క ప్రతిపాదనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ కౌన్సిల్ ఏజెండాలో తమ ప్రతిపాదన రాలేదన్నారు. ఈ నేపధ్యంలో తక్షణం తమ ప్రతిపాదనను సప్లమెంటరీ ఏజండాల్లో, కనీసం టేబుల్ ఎజెండా గానైనా పొందుపర్చాలని వారు డిమాండ్ చేశారు. బండు తండాలో నేలపై బైఠాయించి సుమారు గంటసేపు సిపిఎం, సిపిఐ కార్పొరేటర్లు ఇద్దరూ నిరసన తెలిపారు.