భయపెడుతున్న వైద్య-వ్యర్థాలు

భయపెడుతున్న వైద్య-వ్యర్థాలు

హోసూరు : ఇక్కడి పారిశ్రామికవాడలోని మూకండపల్లి వద్ద ఓ స్క్రాప్ గోడౌన్ నిర్వాహకుడు ఆసుపత్రులలో వాడిన వైద్య వ్యర్థాలను ఆరుబయట పారేయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ధర్మపురి జిల్లాకు చెందిన రాజా గత రెండు సంవత్సరాలుగా మూకండపల్లి రింగ్ రోడ్డు వద్ద స్క్రాప్ గోడౌన్ నిర్వహిస్తూ, హోసూరు పారిశ్రామిక వాడలోని పరిశ్రమల వ్యర్థాలను, ధర్మపురి, హోసూరు ప్రాంతాలలోని ఆసుపత్రుల వైద్య వ్యర్థాలను కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల కరోనా నిర్ధారణకు వినియోగించిన కిట్లు, ఎయిడ్స్ టెస్ట్ కిట్లను సైతం రెండు జిల్లాల్లోని ఆస్పత్రులలో కొనుగోలు చేసి గోడౌన్ వద్ద గల ఖాళీ ప్రదేశంలో పడేశాడు. ఈ వ్యర్థాలను చూసిన స్థానికులు భయాందోళన చెంది సంబంధిత అధికారులకు సమాచారమందించారు. హోసూరు ప్రాంతంలో ఇటీవల జోరుగా వ్యాప్తి చెందుతున్న కరోనాను నివారించడానికి అధికారులు తంటాలు పడుతుంటే, స్క్రాప్ గోడౌన్ యజమాని రాజా కరోనా టెస్ట్ కిట్లను ఆరుబయట పడేయడం అతని నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు దుయ్యబడుతున్నారు. స్క్రాప్ గోడౌన్ చుట్టూ పొలాలు, చిన్న పరిశ్రమలు ఉన్నాయి. పొలాల్లో పనిచేస్తున్న రైతులు, పరిశ్రమలలో పని చేస్తున్న కార్మికులకు సైతం ఈ వ్యర్థాల వల్ల కరోనా సోకే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు గోడౌన్‌ యజమాని రాజాపై చర్యలు చేపట్టి వ్యర్థాలను వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos