ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు కేంద్రం పలు సూచనలు చేసింది. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో.. చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలు గుమికూడటం, అనవసర ప్రయాణాలు చేయడం వంటివి మానుకోవాలని.. కరోనా నిబంధనలు పాటించాలని కోరింది.
పలు దేశాల్లో వైరస్ నాలుగో ఉద్ధృతి మొదలైందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంకా పోరాడాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. ఒమిక్రాన్.. డెల్టా కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. ప్రపంచవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 6.1 శాతం ఉందని చెప్పారు.
ఒమిక్రాన్ కేసులు ఒకటిన్నర నుంచి మూడు రోజుల్లోపే రెట్టింపు అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందని వెల్లడించారు. ఐరోపా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా దేశాల్లో కొవిడ్ కేసులు వారం వారం బాగా పెరిగిపోతున్నాయని, ఆసియా దేశాల్లో ఇప్పటికీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. అయినా నిర్లక్ష్యం ఏమాత్రం తగదని, ఇంకా పోరాడాల్సిందేనని అన్నారు.