ప్రధాని మోదీకి భూపేష్ స్ట్రాంగ్ కౌంటర్

ప్రధాని మోదీకి భూపేష్ స్ట్రాంగ్ కౌంటర్

రాయ్పూర్:‘మహాదేవ్ బెట్టింగ్ యాప్’ కేసు వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు దుబాయ్ వ్యక్తులతో మీకు ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి?అని ప్రశ్నించారు. ఇంతవరకూ అరెస్టులు ఎందుకు చేయలేదు? యాప్ని ఎందుకు బహిష్కరించలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. చైనా యాప్స్ని బ్యాన్ చేయగలిగినప్పుడు మహాదేవ్ బెట్టింగ్ యాప్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలేంటి? అనే కోణంలో ప్రధాని మోదీని భూపేష్ నిలదీశారు.
ఇంతకీ ప్రధాని చేసిన వ్యాఖ్యలేంటి?
ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తన ఎన్నికల ప్రచారానికి నిధుల కోసం కాంగ్రెస్ పార్టీ అక్రమ బెట్టింగ్ నిర్వాహకుల నుండి హవాలా డబ్బును ఉపయోగిస్తోందని ఆరోపించారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు భూపేష్ బఘేల్కు రూ.508 కోట్ల డబ్బులు చెల్లించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన వాదనలను మోదీ ప్రస్తావిస్తూ ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని (ప్రజల్ని ఉద్దేశిస్తూ) దోచుకునే ఎలాంటి అవకాశాన్నైనా వదిలిపెట్టడం లేదన్నారు. వారు ‘మహదేవ్’ పేరును కూడా విడిచిపెట్టలేదని పేర్కొన్నారు. చత్తీస్గఢ్ ప్రభుత్వంలో అవినీతిలో కూరుకుపోయిందనని ఆరోపించిన ఆయన తమ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి మోసాలపై విచారణ జరిపి, దోచుకున్న వారిని శిక్షిస్తామన్నారు.
మోదీ వ్యాఖ్యలకు భూపేష్ బఘేల్ కౌంటర్
ప్రధాని మోదీ చేసిన ఆ ఆరోపణలపై భూపేష్ బఘేల్ స్పందిస్తూ.. ‘‘నిజంగా అవినీతి జరిగి ఉంటే, ఆ యాప్ని ఎందుకు మూసివేయలేదు? ఆ యాప్ని శాశ్వతంగా మూసివేసే బాధ్యత భారత ప్రభుత్వానిదే. అసలు వాళ్లతో ప్రధాని మోదీకి ఉన్న ఒప్పందం ఏంటని నేను అడగాలనుకుంటున్నాను. ఒకవేళ ఎలాంటి డీల్ లేకపోతే.. భారత ప్రభుత్వం ఆ యాప్ని బ్యాన్ చేసే దిశగా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని కౌంటర్ ఎటాక్ చేశారు. అంతే కాదు.. బీజేపీ వాళ్లు ప్రత్యక్ష పోరాటం చేయలేరని, అందుకే ఈడీ, ఐటీ, మీడియా ద్వారా ఎన్నికల్లో పోరాడుతున్నారని దుయ్యబట్టారు. ఎలాంటి విచారణ లేకుండానే మోదీ ఆరోపణలు చేస్తున్నారని.. ఈడీ, ఐటీ ఇక్కడ తిరుగుతున్నాయని.. ఇది మీ (మోదీ) విలువలేనితనాన్ని తెలియజేస్తుందని బఘేల్ ధ్వజమెత్తారు.
అసలు మహాదేవ్ బెట్టింగ్ యాప్ వివాదం ఏంటి?
ఫోరెన్సిక్ విశ్లేషణ, క్యాష్ కొరియర్ చేసిన ప్రకటన ఆధారంగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్కు ఇప్పటివరకూ సుమారు రూ. 508 కోట్లు చెల్లించారనే ఆరోపణలకు దారితీసిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తెలిపింది. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos