ప్రకృతి సోయగాల లోగిలి బ్రహ్మగిరి..

  • In Tourism
  • February 3, 2020
  • 326 Views
ప్రకృతి సోయగాల లోగిలి బ్రహ్మగిరి..

కర్ణాటకలోని పర్యాటక ప్రాంతాలకు,ప్రకృతి అందాలకు చిరునామాగా విరాజిల్లుతున్న మలెనాడు ప్రాంతంలోని కొడగు జిల్లా మలెనాడు మకుటంలో కలికితురాయిగా వెలుగుతోంది.ఏదోఒక ప్రాంతం కాకుండా జిల్లా మొత్తం పర్యాటక ప్రాంతాలతోనే విరాజిల్లుతుండడం కొడగు ప్రత్యేకత.ఏడాది పొడవునా చల్లటి వాతావరణంతో,ఎత్తైన కొండలు,కాఫీ తోటలు,దట్టమైన అడవులు ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తులతూగుతోంది.ఇక దేవతల భూమిగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన కేరళ రాష్ట్రం సైతం కొడగు జిల్లాకు సరిహద్దుగా ఉండడంతో కొడగు సంస్కతి,సంప్రయాదాలు,ఆచారాల పరంగా కూడా ప్రత్యేకస్థానం కలిగి ఉంది.కొడగు జిల్లాలోని అతిముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఒకటి.

బ్రహ్మగిరి అడవులు..

కేరళ రాష్ట్రంలోని వైనాడ్‌ జిల్లాకు సరిహద్దులో ఉన్న బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం దట్టమైన అడవులు,పచ్చటి బయళ్లు,ఎత్తైన కొండలు వాటిని స్పృశిస్తూ వెళ్లే తెల్లనైన మబ్బులతో రమ్యమనోహరంగా ఉంటుంది.సముద్రమట్టానికి 1607 మీటర్ల ఎత్తులో 181 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం దట్టమైన అడవులు,అరుదైన వృక్షసంపద,పక్షుల జాతులతో పాటు క్రూరమృగాలకు ఆలవాలంగా భాసిల్లుతోంది.సతత హరిత,పాక్షిక హరిత అడవులతో పాటు షోలా అడవులు కలిగి ఉన్న బ్రహ్మగిరిలో ఎన్నో అందమైన జలపాతాలు, పక్షిధామాలు,వన్యప్రాణులు సంరక్షణ కేంద్రాలు,పురాతన గుహలు కలిగి ఉంది.ఎటు చూసినా పచ్చటి తివాచిలా కనిపించే పచ్చిక మైదానాలపై మొలచిన గడ్డిపై నీటి బిందువులు కాళ్లను స్పృశిస్తుండగా ట్రెక్కింగ్‌ చేస్తుంటే కలిగే అనుభూతి మాటలకు అందదు.బ్రహ్మగిరి ట్రెక్కింగ్‌లో ప్రధానంగా చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుంటే..

బ్రహ్మగిరి అడవుల్లో జతపాతం..

ఇరుప్పు జలపాతం..
కావేరి నదికి ఉపనది అయిన లక్ష్మణ తీర్థ నది పేరు మీదుగా ఈ జలపాతాన్ని లక్ష్మణ తీర్థ జలపాతంగా కూడా పిలుచుకుంటారు.లక్ష్మణ తీర్థ నది ఒడ్డున ఉన్న పురాతన శివాలయం,రామేశ్వర ఆలయం ఆధ్యాత్మిక భావనలు వెదజల్లుతాయి.పశ్చిమ కనుమల అడవిలో ఎత్తైన సహజసిద్ధమైన రాళ్లపై నుంచి దూకే లక్ష్మణతీర్థ జలపాతం అందాలు చూడడానికి రెండు కళ్లూ చాలవు.పచ్చనైన అడవి మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉండే లక్ష్మణజలపాతం వద్ద ఎంతసేపు ఉన్నా తనివి తీరదనిపిస్తుంది.జలపాతం నుంచి బ్రహ్మగిరి శిఖరానికి చేరుకునే నడకదారిలో ట్రెక్కింగ్‌ చేయడానికి పర్యాటకులు అమితంగా ఆసక్తి చూపుతారు.లక్ష్మణతీర్థ జలపాతానికి పురాణాల చరిత్రకూడా దాగి ఉందని తెలుస్తోంది.వనవాసం సమయంలో రావణుడు సీతాదేవిని అపహరించగా సీతను వెతికే క్రమంలో రామలక్ష్మణులు ఈ మార్గం మీదుగా వెళ్లినట్లు స్థలపురాణం.ఈ క్రమంలో తాగునీరు కావాలని రాముడు కోరడంతో లక్ష్మణుడు బ్రహ్మగిరి కొండల్లో బాణాన్ని సంధించడంతో తీర్థం ఉద్భవించిందని ప్రతీతి.అందుకే ఈ నదికి,జలపాతానికి లక్ష్మణతీర్థగా పేరు వచ్చిందని స్థలపురాణం..

ఇరుప్పు జలపాతం..

తిరునెల్లి ఆలయం..
శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడిన తిరునెల్లి ఆలయం పర్యాటకంగానే కాకుండా ఆధ్యాత్మిక భావనలతో విశేషంగా ఆకట్టుకుంటుంది.నాణ్యమైన టేకు చెక్కలతో నిర్మించిన ఆలయం నిర్మాణశైలి మరింత అబ్బురపరుస్తుంది.అటవీమార్గంలో జింకలు,ఏనుగులు తదితర వన్యప్రాణులు,క్రూరమృగాలను అతి సమీపం నుంచి చూస్తూ తిరునెల్లి ఆలయానికి చేరుకోవడం అందమైన అనుభవం.ఇక ఆలయంలోకి ప్రవేశించాలంటే హిందూ సంప్రదాయబద్దమైన డ్రెస్‌కోడ్‌ తప్పనిసరిగా పాటించాలి..

తిరునెల్లి ఆలయం..

పక్షిపాతాళం..
తిరునెల్లి పట్టణం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోనున్న పక్షిపాతాళం కూడా తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం.వందకు పైగా పలు జాతుల పక్షులను పక్షిపాతాళంలో చూడవచ్చు.పక్షిపాతాళం కేరళ రాష్ట్రం పరిధిలోకి వచ్చినా బ్రహ్మగిరి నుంచి సమీపదూరంలోనే ఉండడంతో బ్రహ్మగిరి పర్యటనకు వెళితే ఈ పక్షిపాతాళానికి సైతం వెళ్లడానికి ఆసక్తి చూపుతుంటారు.కేవలం పక్షిధామంగానే కాకుండా ట్రెక్కింగ్‌కు సైతం ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధి చెందింది.సముద్రమట్టానికి 1740 మీటర్ల ఎత్తులో ఉండే పక్షిపాతాళం కొండలపై ట్రెక్కింగ్‌ ఎన్నో అందమైన అనుభవాలు ఇస్తుంది.పాపనాశిని నది తీరం అందాలు ఈ ట్రెక్కింగ్‌లో మరో మరచిపోలేని మధుర జ్ఞాపంగా మిగిలిపోతుంది..

పక్షిపాతాళం..

షోలా అడవులు..
ఎత్తైన కొండలు,మధ్యలో దట్టమైన అడవులతో షోలా అడవులు ఎంత అందగా ఉంటాయో అంతే భయంకరంగా కూడా ఉంటాయి.బయటనుంచి చాలా అందంగా కనిపించే షోలా అడవుల్లో ట్రెక్కింగ్‌ మీలో ఓపికకు,ధైర్యానికి పరీక్ష పెడుతుంది.బ్రహ్మగిరి శిఖరం వరకు ఆరు షోలా అడవుల్లో ఆరు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్‌ ఆరోహణ,అధిరోహణ క్రమంలో ఉంటుంది.షోలా అడవుల్లో ట్రెక్కింగ్‌ చేయాలంటే తిరునెల్లి,శ్రీమంగల అటవీశాఖ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది..

షోలా అడవులు..

బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యంలో సింహం తోక మకాక్‌,ఏనుగులు,పెద్దపులులు,చిరుతపులలు,అడవి పిల్లులు,చిరుత పిల్లులు,బద్దకపు ఎలుగుబంటి,సాంబార్‌ జింకలు,మచ్చల జింకలు,నీలగిరి కోతులు,లోరిస్‌,బోనెట్‌ మకాక్‌,మూషిక జింకలు,మలబార్‌ జేయింట్‌ ఉడుతుల,ఎగిరే ఉడుతల,కామన్‌ ఓటర్‌,సివెట్‌,పాంగోలిన్‌ తదితర ఎన్నో వన్యప్రాణులు,క్రూరమృగాలు చూడవచ్చు.వీటితో పాటు బ్లాక్‌ బుల్‌బుల్‌,పచ్చపావురం,కొండచిలువలు,నల్లత్రాచులు,మలబార్‌ పిట్‌వైపర్‌ తదితర అత్యంత ప్రమాదకర పాములు కూడా బ్రహ్మగిరి నిలయంగా విరాజిల్లుతోంది..
ఎలా చేరుకోవాలి..
బెంగళూరు నుంచి 270 కిలోమీటర్ల దూరంలోనున్న కూర్గ్‌ చేరుకొని అక్కడినుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించి బ్రహ్మగిరి చేరుకోవాలి.రైలుమార్గం ద్వారా చేరుకోవాలంటే మైసూరు చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ,ప్రైవేటు వాహనాల్లో కూర్గ్‌ చేరుకొని అక్కడి నుంచి బ్రహ్మగిరి చేరుకోవాలి..

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos