న్యూ ఢిల్లీ: యాపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. అందుకే రోజుకో యాపిల్ అయినా తినాలని.. వీటిని తినడం వల్ల డాక్టర్ అవసరమే ఉండదని చెబుతుంటారు. ఈ పండ్లు విటమిన్లు, ఫైబర్, ఇతర పోషకాలకు గనులు. పండుగానే కాకుండా వీటిని సలాడ్స్లో, డెజర్ట్గానూ తినొచ్చు. అయితే, మనం ఇప్పటి వరకూ రెడ్ యాపిల్స్, గ్రీన్ యాపిల్స్ను మాత్రమే చూశాం.. తిన్నాం. కానీ బ్లాక్ యాపిల్స్ కూడా ఉంటాయని తెలుసా..? పోనీ ఎప్పుడైనా చూశారా..? లేదు కద..! అయితే ఇది మీ కోసమే. యాపిల్ జాతుల్లోనే ఈ పండుకు చాలా ప్రత్యేకత ఉంది. నల్ల రంగులో ఉండే యాపిల్స్ చాలా ఖరీదైనవి.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే ఎన్నో రకాల రోగాలను కూడా నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి కేవలం చైనా, టిబెట్లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. వీటిని ‘బ్లాక్ డైమండ్ యాపిల్స్’ అని కూడా పిలుస్తారు. పైన నల్లగా ఉన్నా.. లోపల మాత్రం సాధారణ యాపిల్ పండులానే తెల్లగా ఉంటుంది. ఈ పండును చూడగానే తినేయాలనిపించేలా నిగనిగలాడుతూ ఉంటుంది.ఇక దీని ఖరీదు విషయానికి వస్తే ఒక్కో పండు రూ.500 వరకూ ఉంటుంది. ఈ యాపిల్కు మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్.. సాధారణంగా యాపిల్ చెట్లు రెండు మూడేళ్లలోనే కాపు మొదలు పెడతాయి. అయితే, బ్లాక్ యాపిల్ తొలి పంట చేతికందడానికే కనీసం 8 ఏళ్ల సమయం పడుతుందట. ఇంతటి ప్రత్యేకతలు కలిగిన ఈ బ్లాక్ డైమండ్ యాపిల్స్కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి.