బిజెపికి హోసూరు స్థానం…?

బిజెపికి హోసూరు స్థానం…?

హోసూరు : తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా శాసన సభ ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయ పార్టీలు కూటమి పేరిట సీట్ల సర్దుబాటు కోసం చర్చలు జరుపుతున్నాయి. ప్రధాన పార్టీలైన ఎడిఎంకె, డిఎంకెల నాయకత్వంలోని కూటముల్లో సీట్ల సర్దుబాటు విషయమై జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పాలకపక్షమైన ఎడిఎంకె కూటమిలోని పీఎంకే, బిజెపి, డీఎండీకే తదితర పార్టీలు ఎక్కువ సీట్లు దక్కించుకొనేందుకు మంతనాలు జరుపుతున్నాయి. ఒక పక్క పీఎంకే పార్టీ 23 సీట్లను దక్కించుకుంది. ఏయే స్థానాలనేది ఇంకా ఖరారు కాలేదు. అదే కూటమిలోని బిజెపి 30 స్థానాలను  చేసేందుకు  డిమాండ్ చేస్తున్నది. కోయంబత్తూరు, హోసూరు నియోజక వర్గాలను తమ పార్టీకే కేటాయించాలని   పట్టుపడుతున్నట్లు సమాచారం. హోసూరు స్థానాన్ని తమకు వదిలివేయాలని పిఎంకే పార్టీ నాయకులు సైతం పట్టుపడుతున్నారు. ఒక వేళ ఎడిఎంకె అధిష్టానం హోసూరు నియోజక వర్గాన్ని బిజెపికి కేటాయిస్తే, డిఎంకె పార్టీ కూటమిలోని కాంగ్రెస్ పార్టీకి ఆ స్థానం దక్కినా లేక డిఎంకె పోటీ చేసినా హోసూరు స్థానాన్ని డిఎంకె కూటమి కైవసం చేసుకొనే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హోసూరు గ్రామీణ ప్రాంత ఓటర్లు బిజెపి పార్టీ వైపు మొగ్గు చూపినా, హోసూరు పట్టణ ఓటర్లు డిఎంకె పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా పట్టణంలో మైనారిటీ ఓటర్లు కొంత మేరకు ఎడిఎంకె పార్టీ వైపు వున్నా, హోసూరు నియోజకవర్గాన్ని బిజెపి కి కేటాయిస్తే వారుకూడా డిఎంకె పార్టీకి ఓటువేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా ఎడిఎంకె కూటమిలో హోసూరు నియోజక వర్గం బిజేపీకే దక్కవచ్చని బలంగా వినిపిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos