హోసూరులో డిఎంకెలోకి భారీగా వలసలు

హోసూరులో డిఎంకెలోకి భారీగా వలసలు

హోసూరు : శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ…డిఎంకెలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. హోసూరు యూనియన్ మాజీ చైర్‌పర్సన్‌ పుష్ప సర్వేశ్ దంపతులు ఎడిఎంకె పార్టీని వీడి డిఎంకె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన హోసూరు యూనియన్ మాచనాయకనపల్లి పంచాయతీ మాజీ అధ్యక్షుడు మంజునాథ రెడ్డి అధ్యక్షతన మాచనాయకనపల్లి పంచాయతీకి చెందిన కొందరు ప్రముఖులతో పాటు హోసూరు యూనియన్ మాజీ చైర్ పర్సన్ పుష్ప సర్వేశ్ దంపతులు, హోసూరు యూనియన్ లోని పలువురు పంచాయతీ అధ్యక్షులు చెన్నైలో స్టాలిన్ సమక్షంలో డిఎంకె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. డిఎంకె పార్టీ అధినేత స్టాలిన్ వారికి  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

హోసూరు యూనియన్ దక్షిణ విభాగం నుంచి పంచాయతీ మాజీ అధ్యక్షుడు మంజునాథ రెడ్డితో పాటు హోసూరు యూనియన్ మాజీ చైర్ పర్సన్ పుష్ప సర్వేశ్ దంపతులు డిఎంకె పార్టీ తీర్థం పుచ్చుకోవడం వల్ల కాంగ్రెస్‌తో పాటు ఎడిఎంకె పార్టీకి కొంతమేర నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలో హోసూరులో బహిరంగ సభ ఏర్పాటు చేసి డిఎంకె పార్టీ యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో 10 వేలమంది కార్యకర్త లను డిఎంకె పార్టీలో చేర్పించనున్నట్లు హోసూరు యూనియన్ మాజీ చైర్‌పర్సన్ పుష్ప సర్వేశ్ తెలిపారు. ఈ సందర్భంగా తళి ఎమ్మెల్యే వై. ప్రకాష్, హోసూరు ఎమ్మెల్యే సత్య, వేపనపల్లి ఎమ్మెల్యే మురుగన్‌తో పాటు డిఎంకె పార్టీ కౌన్సిలర్లు సంపత్ కుమార్, రాధ గజేంద్రన్, రాధ వెంకటస్వామి, పలువురు పంచాయతీ అధ్యక్షులు ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos