స్వర్గం కూడా ఈర్ష్య పడే అందం భద్ర అభయారణ్యం సొంతం..

  • In Tourism
  • February 1, 2020
  • 306 Views
స్వర్గం కూడా ఈర్ష్య పడే అందం భద్ర అభయారణ్యం సొంతం..

లెక్కలేనన్ని అద్భుత పర్యాటక ప్రాంతాలతో ఏడాది పొడవుగా పచ్చటితివాచిలా దర్శనమిస్తూ దట్టమైన పశ్చిమ కనుమల్లో స్వర్గసీమ నుంచి భూమిపైకి జారిపడిందేమో అనిపించేలా ఉండే చిక్కమగళూరు జిల్లాలో మరో అత్యద్భుత పర్యాటక ప్రదేశం భద్ర వన్యప్రాణుల అభరయారణ్యం. చిక్కమగళూరు జిల్లా కేంద్రం నుంచి 38 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ కనుమల అటవీప్రాంతంలో సుమారు 500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న భద్ర వన్యప్రాణుల అభయారణ్యం ఎంతచూసినా తనివితీరదనిపిస్తుంది.మలెనాడు జిల్లాగా ప్రసిద్ధి చెందిన చిక్కమగళూరులో ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ప్రాంతం ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటుంది.ఆకాశాన్ని తాకే పర్వత అంచులు, ఎత్తుగా, గుబురుగా పెరిగిన చెట్లు వాటిపై ఎన్నడూ చూడని పలు జాతుల పక్షులు అడవిలో వ్యాఘ్రాల నుంచి అడవి నక్కల వరకు అన్ని జాతుల వన్యప్రాణులు తారసపడతాయి.

గంభీరంగా చూస్తున్న పెద్దపులి..

ప్రశాంత వాతావరణంలో చెట్లపై నుంచి పక్షుల కిలకిలరావాలు వినసొంపుగా ఉంటూ ట్రెక్కింగ్‌ను ఆసాంతం ఆహ్లాదంగా ఉంచుతాయి.అక్కడక్కడా గంభీరంగా నడుస్తూ పెద్దపులు,చిరుతపులులు తారసడతాయి.టేకు,రోజ్‌ఉడ్‌,వెదురు తదితర 120కి పైగా వృక్షజాతులను అభయారణ్యంలో తిలకించవచ్చు. భద్ర వన్యప్రాణుల అభయారణ్యంలో నీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో వన్యప్రాణుల వీక్షణ,ట్రెక్కింగ్‌తో పాటు నీటి ఆధారిత సాహసాలు, అక్కడక్కడా నదీ ప్రవాహాల మధ్య ఏర్పాటు చేసిన ద్వీపాల్లో బస(ఐలాండ్‌ క్యాంపింగ్‌),రాక్‌ క్లైంబింగ్‌ తదితర సాహసాలు పర్యాటకులకు అదనపు వినోదాన్ని అందిస్తాయి.ఇక అభయారణ్యంలో నివసించే వన్యప్రాణుల మధ్య సమైక్యత చాలా ప్రత్యేకంగా చూడముచ్చటగా ఉంటుంది.ముఖ్యంగా చెట్లపై ఉండే లంగూర్ల(కోతి జాతిలో ఒక రకం) చెట్లపై ఉండే పండ్లను కింద ఉన్న జింకల కోసం పడేస్తూ ఉంటాయి.

షికారు చేస్తున్న గజరాజు ..

అంతేకాదు పులులు,చిరుతలు తదితర క్రూరమృగాల రాకను ముందుగానే కింద ఉన్న జింకలు,కోతులు తదితర వాటికి ప్రత్యేక శబ్దాలతో సంకేతాలు పంపించి అప్రమత్తం చేస్తాయి.ఇక అక్కడ జలప్రవాహాల సవ్వళ్లకు మైమరిచి పక్షులు వినిపించే గీతాలు మనసకు ఇచ్చే ఆహ్లాదం భూమిపై మరెక్కడా లభించదు.ఇక భద్ర నది తీరాన పెద్దపులుల మధ్య యుద్ధం,పచ్చిక బైళ్లలో చెంగుచెంగున ఎగురుతూ కనిపించే జింకలు,నీటి ప్రవాహంలో గజరాజుల జలకాలాటలు,చెట్ల కింద విశ్రాంతి తీసుకునే చిరుతలు ఇలా వన్యప్రాణుల జీవనశైలిని చూస్తుంటే ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అభయారణ్యం మొత్తం తిరిగుతూ వన్యప్రాణులు,అటవీఅందాలు తిలకించడానికి పర్యాటక శాఖ వైల్డ్‌లైఫ్‌ సఫారీ అందుబాటులో ఉంచింది.అటవీశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో ప్రయాణిస్తూ అడవిలో స్వేచ్ఛగా,గంభీరంగా తిరిగే వన్యప్రాణులు,క్రూరమృగాలను చూడవచ్చు.ఇక భద్ర అభయారణ్యంలో చూడాల్సిన మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలసుకుంటే..

నల్ల చిరుత..

పచ్చిక బైళ్లలో జింకలు..

 

హెబ్బే జలపాతం..
పశ్చిమ కనుమల్లో రెండు పాయలుగా విడిపోయి సుమారు 551 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే హెబ్బే జలపాతం తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.దొడ్డ హెబ్బ,చిక్క హెబ్బే అనే రెండు జలపాతాలుగా విడిపోయి కిందకు దూకే హెబ్బే జలపాతాన్ని చూస్తుంటే తెల్లటి ముత్యాలు నీళ్లరూపంలో కిందకు దూకుతున్నట్లు భావన కలుగుతుంది.దట్టమైన అటవీప్రాంతంలో ట్రెక్కింగ్‌ చేసి శారీరకంగా అలసిపోతే హెబ్బే జలపాతం వద్ద కొలనులో ఈత కొడుతుంటే కలిగే ఆనందం మాటలకు అందదు..

హెబ్బె జలపాతం..

మాణిక్యధార జలపాతం..
పశ్చిమ కనుమల్లో భద్ర,దాని ఉపదనులు కలసి ప్రవహించే బాబా బూడాన్‌ గిరి కొండపై ఉన్న మాణిక్యధార జలపాతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.హిందువులతో పాటు ముస్లింలకు కూడా ఈ ప్రాంతం పవిత్రమైన ప్రాంతంగా విరాజిల్లుతోంది.సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే ఈ జలపాతాన్ని నెల్లికాయ్‌ తీర్థ అని కూడా పిలుస్తారు.మాణిక్యధార అంటే తెలుగులో ముత్యాలతీగ అని అర్థం.ప్రశాంతమైన,సుందరమైన వాతావరణంలో ఉండడంతో ఈ ప్రాంతానికి మాణిక్యధారగా గుర్తింపు వచ్చింది.అనేక ఔషధమూలికల చెట్లు ఉన్న నేపథ్యంలో మాణిక్యధార జలపాతంలో స్నానం చేస్తే చర్మ సంబంధిత రోగాలతో పాటు పలు రోగాలు నయమవుతాయని ప్రసిద్ధి.ఇక జలపాతం దిగువన ఉన్న కొలనులో ఈత కొట్టే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.కొలను చాలా లోతుగా ఉన్న నేపథ్యంలో కొలనుచుట్టూ రక్షణవలయం ఏర్పాటు చేశారు.

మాణిక్యధార జలపాతం..

ఇక భద్ర అభయారణ్యం అతిపెద్ద పులలు సంరక్షణ కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.భద్ర అభయారణ్యంలో సుమారు 33 పెద్దపులులు ఉన్నట్లు అంచనా.పెద్దపులులతో పాటు చిరుతలు,నల్లచిరుతలు,బద్దకపు ఎలుగుబంట్లు,ఏనుగులు,అడవిదున్నలు,మచ్చల జింకలు,సాంబార్‌ జింకలు,మూషిక జింకలు,ఎగిరే ఉడుతలు,తాటి సీవెట్‌,భారతీయ సీవెట్‌,మొరిగే జింకలు, తదితర వన్యప్రాణులను తిలకించవచ్చు.వీటితో పాటు చిరుత పిల్లి,మచ్చలపిల్లి,రడ్డీ ముంగీస,చారలమెడ ముంగీస,ఓటర్స్‌ తదితర మాంసాహార ప్రాణులకు కూడా భద్ర అభయారణ్యం నిలయంగా ఉంటోంది.

అడవిదున్న..

ఇక సాధారణ వైన్‌పాము,నల్లత్రాచులు,సాధారణ త్రాచులు,రక్తపింజర(రస్సెల్‌ వైపర్‌),వెదురు పిట్‌ వైపర్‌,ర్యాట్‌ స్నేక్‌,ఆలీవ్‌ కీల్‌బ్యాక్‌,సాధారణ తోడేలు పాటు,భారతీయ మానిటర్‌,డ్రాకో లేదా గ్లైడింగ్‌ బల్లులు,మార్ష్‌ మొసళ్లు తదితర సరీసృపాలు సైతం దర్శనమిస్తాయి.ఇక భద్ర అభయారణ్యంలో బూడిద జంగిల్‌ఫౌల్‌,ఎరుపు స్పర్‌ఫౌల్‌,బుష్‌పిట్టలు,పచ్చపావురాలు,ఇంపీరియల్‌ పావురాలు,మలబార్‌ పారాకీట్‌,హిల్‌మైనా(కొండ కోయిల),రూబీథ్రోటెడ్‌ బుల్‌బుల్‌,షామా,మలబార్‌ ట్రోగన్‌,మలబార్‌ త్రష్‌,హార్నిబిల్‌,రాకెట్‌ టెయిల్డ్‌ డ్రోంగో తదితర 300కు పైగా పక్షుల జాతులు ఉన్నాయి.అన్నిటికంటే ముఖ్యంగా భద్ర అభయారణ్యంలో కనిపించే సీతాకోక చిలుకలు మరే అభయారణ్యంలో కనిపించవు.యమ్‌ప్లై,బారోనెట్‌,క్రిమ్సన్‌ రోజ్‌,బర్డ్‌వింగ్‌,టెయిల్డ్‌ జే,గ్రేట్‌ ఆరెంజ్‌ టిప్‌,బ్లూ పాన్సీ తదితర పలు రకాల సీతాకోకచిలుకలు మనసకు ఆహ్లాదం పంచుతాయి..

పొదల మధ్య చిరుత పులి..

ఎలుగుబంటి..


ఎలా చేరుకోవాలి..
బెంగళూరు నుంచి ప్రైవేటు లేదా ప్రభుత్వ వాహనాల్లో రోడ్డు మార్గం ద్వారా చిక్కమగళూరు చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో భద్ర అభయారణ్యం చేరుకోవచ్చు.రైలు మార్గంలో అయితే బెంగళూరు నుంచి కడూరు రైల్వేస్టేషన్‌ చేరుకొని అక్కడి నుంచి 51 కిలోమీటర్ల దూరంలోనున్న భద్ర అభయారణ్యానికి ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos