అద్భుత రూపాలు బేలూరు శిల్పాలు..

  • In Tourism
  • November 4, 2019
  • 673 Views
అద్భుత రూపాలు బేలూరు శిల్పాలు..

కర్ణాటకలోని అతిపురాతమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న పట్టణాల్లో బేలూరు ప్రముఖమైనది.యగాచి నది ఒడ్డున దక్షిణకాశీగా కీర్తి గడించిన బేలూరు పట్టణం హొయ్సళ రాజులకు రాజధానిగా విరాజిల్లింది.ఎన్నో ప్రాచీనమైన, ప్రముఖమైన దేవాలయాలకు బేలూరు పట్టణం కేంద్రంగా నిలుస్తోంది.ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పట్టణంలో హొయ్సళ రాజులు నిర్మించిన చెన్నకేశవ స్వామి దేవాలయం నాటి రాజుల కళాపోషణకు,శిల్పుల అత్యద్భుత ప్రతిభకు తార్కాణంగా నిలుస్తోంది.దేవాలయం నిర్మాణం,శిల్పాల సౌందర్యం చూపుతిప్పుకోనివ్వదంటే అతిశయోక్తి కాదేమో.

రాతి స్తంబంపై నాట్య విగ్రహాలు


చోళులపై తన విజయానికి చిహ్నంగా హోయసల విష్ణువర్ధనుడు కట్టించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.వైష్ణవ దేవాలయమైన చెన్నకేశవ స్వామి దేవాలయం ఎత్తైన గాలిగోపురం చాలా ప్రసిద్ధి చెందింది.శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడే విధంగా అత్యంత అందంగా అద్భుతంగా నయనమనోహరంగా ఉండే ఈ గాలిగోపురం నిర్మాణానికి పదేళ్ల సమయం పట్టిందంటే ఈ గోపురం విశిష్టత ఏంటో తెలియజేస్తోంది. పురాణాల్లోని అనేక గాథలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును. వీటితో పాటు నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆలయం ప్రవేశద్వారం వద్ద మెట్లబావిగా పిలువబడే పుష్కరిణి, అంతర్భాగంలోనే కప్పే చేన్నిగరాయ ఆలయం, మరియు లక్ష్మి దేవీకి అంకితం చేసిన ఒక చిన్న కట్టడము కూడా ఉన్నాయి.

చెన్నకేశవ స్వామి దేవాలయ గాలిగోపురం..


దర్పణ సుందరి


ఆలయంలో ‘దర్పణ సుందరి’గా ప్రసిద్ది పొందిన శిల్ప౦ తప్పక తిలకించాల్సిన ఆకర్షణలలో ఒకటి. ఈ శిల్పం ఈ ప్రఖ్యాత దేవాలయ గోడలపై చెక్కబడి ఉంది.ఆధ్యాత్మిక, ఖగోళ చిత్రాలను, నృత్య , గానాలు చేస్తున్న మదనికల చిత్రాలను చూడవచ్చు. విష్ణువర్ధన రాజు భార్య రాణి శంతల దేవి అద్భుతమైన అందం ఈ శిల్పాలకు ప్రధాన ప్రేరణ అని స్థానిక చరిత్ర.దీంతోపాటు అదే ఆవరణలో వీరనారాయ, సౌమ్యనాయకి, రంగనాయకి, శ్రీదేవి, భూదేవిల కోసం నిర్మించిన ఆలయాలను సందర్శించవచ్చు.ఆలయంలో నరసింహ రాయల కాలంలో నిర్మించిన విష్ణు సముద్రంగా ప్రసిద్ధి చెందిన పెద్ద సరస్సును కూడా తప్పకుండా చూడాల్సిందే.విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన టెంపుల్ ట్యాంక్ కూడా తప్పక చూడాల్సిన ప్రదేశం.చతురాస్రాకార ఆకారంలో సరస్సు ఉత్తరపు మెట్లను నిర్మించి, మూడు వైపులా మరి కొన్ని మెట్లను జోడించారు.

టెంపుల్ ట్యాంక్


గ్రావిటీ పిల్లర్ :
బేలూరు ఆలయంలో అత్యంత ప్రధాన ఆకర్షణల్లో ఒకటి గ్రావిటీ పిల్లర్.42 అడుగుల ఎత్తుతో నిర్మించబడ్డ ఈ రాతి స్తంబం ఈ స్థూపం దాని స్వంత బరువుపై మూడు వైపుల నిలబడి, నాలుగో వైపు నేలకు ఆనకుండ కాగితం ముక్కను దూర్చినా దూరే విధంగా ఖాళీ తో నిరాధారంగా నిలబడేలా చెక్కడం విజయనగర పాలన లోని వాస్తుశిల్పుల సమర్థతకు,శిల్పుల నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.ఇక ఆలయంలోని హిరణ్యకశపుడిని సంహరించే దృశ్యం విగ్రహం,నారాయణ విగ్రహం,గరుడ విగ్రహంతో పాటు 37 స్తంబాలతో మంటపానికి ఇరువైపులా నిర్మించిన రెండు దేవాలయాలు కూడా ప్రధాన ఆకర్షణ.

గ్రావిటీ పిల్లర్


విష్ణు పాదముద్రికలు బయటి గోడ పశ్చిమం వైపు విజయ నారాయణ, చెన్నకేశవ, లక్ష్మీ నారాయణ వంటి మనోహరమైన దేవతా మూర్తులచే అలంకరించబడి ఉంటుంది. పర్యాటకులు భీమ, వినాయక, శివ, విష్ణు, బ్రహ్మ, సరస్వతి, పార్వతి, భైరవ మూర్తుల యొక్క 59 పెద్ద చిత్రాలను కూడా చూడవచ్చు.పర్యాటకులు వీర నారాయణ ఆలయం చేరువలో ఉన్నటువంటి సౌమ్యనాయకి, కప్పేచేన్నిగరాయ, అండాళ్ వంటి అనేక చిన్న ఆలయాలు కూడా దర్శించవచ్చు.బేలూర్ వద్ద చూడదగిన ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో దొడ్డ గాదవల్లి లోని లక్ష్మీ దేవి ఆలయం. శ్రావణ బెలగోళ లో వున్న జైన్ స్మారక మందిరము ఉన్నాయి.

కట్టిపడేసే శిల్పాలు..


కట్టిపడేసే శిల్పాలు..


ఎలా చేరుకోవాలి ?
బెంగళూరు నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలూరుకు చేరుకోవాలంటే ముందుగా బస్సు లేదా రైలు మార్గం ద్వారా హాసన్ పట్టణానికి చేరుకోవాలి.అక్కడి నుంచి ప్రభుత్వ,ప్రైవేటు బస్సుల్లో బేలూరుకు చేరుకోవచ్చు.అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్డు,రైలు మార్గం ద్వారా బేలూరుకు సులభంగా చేరుకోవచ్చు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos