కోహ్లి, రోహిత్‌లపై బీసీసీఐ సీరియస్

  • In Sports
  • June 21, 2022
  • 87 Views
కోహ్లి, రోహిత్‌లపై బీసీసీఐ సీరియస్

త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు ఫార్మాట్ల సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్, మాజీ కెప్టెన్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీరి ఫోటోలే ఇందుకు కారణమని సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఓ టెస్ట్, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం కొద్దిరోజుల కిందట లండన్‌ పర్యటనకు వెళ్లిన టీమిండియా ప్రస్తుతం లీసెస్టర్‌షైర్‌లో ప్రాక్టీస్ చేస్తూ బిజీబిజీగా గడుపుతుంది. అయితే రెండు రోజుల కిందట రోహిత్, కోహ్లిలు షాపింగ్ అంటూ లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫోటోలకు పోజులివ్వడం నెట్టింట వైరలైంది.


యూకేలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రోహిత్, కోహ్లిలు మాస్కులు లేకుండా వీధుల్లో తిరగడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుందని సమాచారం. ఇదే విషయమై బీసీసీఐ రోహిత్, కోహ్లిలతో పాటు టీమిండియా మొత్తాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. టీమిండియా ఆటగాళ్లందరూ కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని లేని పక్షంలో చర్యలు తీసుకునేందుకు ఎంత మాత్రం వెనకాడేది లేదని వార్నింగ్ ఇచ్చిందని సమాచారం.
కాగా, యూకేలో కోవిడ్ తీవ్రత గత కొద్ది రోజులతో పోలిస్తే ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆక్కడ ఇప్పటికీ రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే టీమిండియా కీ స్పిన్నర్ అశ్విన్ కోవిడ్ కారణంగా జట్టుతో పాటు ట్రావెల్ చేయలేకపోయాడు. ఇదిలా ఉంటే, గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిపోయిన టెస్ట్ మ్యాచ్ జులై 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 5 మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో గతేడాది జరిగిన నాలుగు టెస్టుల్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.
ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ.

జులై 7న తొలి టీ20, 9న రెండు, 10న మూడో టీ20 మ్యాచులు జరుగనున్నాయి. 12న తొలి వన్డే, 14న రెండు, 17న మూడో వన్డేలు జరుగుతాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos