విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో నిందితుడుగా రాజమండ్రి జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఆదేశాల్ని జారీ చేశారు. చంద్రబాబుకు ఈ నెల 11 నుంచి జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జైలులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ బాబును న్యాయమూర్తి ప్రశ్నించారు. మరో రెండు రోజులు రిమాండ్లోనే ఉండాల్సి ఉంటుందంటూ వెల్లడించారు. చట్టం అందరికీ సమానమేనని, మీపై ఆరోపణలు మాత్రమే వచ్చాయని దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయన్నారు. రిమాండ్ను శిక్షగా భావించొద్దని, ఇది చట్టప్రకారం జరుగుతున్న కార్యక్రమమని స్పష్టం చేశారు.అమరావతి రింగురోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై నేడు విచారణ చేపట్టనున్నట్టు కోర్టు పేర్కొంది.